Telugu Global
Telangana

కేటీఆర్ అమెరికా పర్యటన.. తెలంగాణలో పెట్టుబడులకు క్యూ కడుతున్న సంస్థలు

తెలంగాణలో ఎలాంటి వ్యాపారాన్ని అయినా మొదలు పెట్టేందుకు అన్ని వనరులు సిద్ధంగా ఉన్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

కేటీఆర్ అమెరికా పర్యటన.. తెలంగాణలో పెట్టుబడులకు క్యూ కడుతున్న సంస్థలు
X

రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్లిన ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. అక్కడ పలు కంపెనీల చైర్మన్లు, సీఈవోలు, ప్రతినిధులతో వరుసగా సమావేశం అవుతున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను కేటీఆర్ అండ్ టీమ్ వివరిస్తుండటంతో.. అక్కడి సంస్థలు ఇన్వెస్ట్ చేయడానికి క్యూ కడుతున్నాయి. బుధవారం మంత్రి కేటీఆర్ వరుసగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

పెట్టుబడులకు రాష్ట్రం ఆదవర్శవంతం..

తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల విధానాలు ప్రగతిశీల మార్గంలో ఉంటాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. పెట్టుబడులుకు రాష్ట్రం చాలా ఆదర్శవంతమైనదని వివరించారు. కాన్స్యులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరమ్ సంయుక్తంగా నిర్వహించిన ఇన్వెస్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. న్యూయార్క్ సిటీతో తనకు చాలా అనుబంధం ఉందని పేర్కొన్నారు. ఇక్కడే చదువుకొని, పని చేసినట్లు ఆయన తెలిపారు.

తెలంగాణలో ఎలాంటి వ్యాపారాన్ని అయినా మొదలు పెట్టేందుకు అన్ని వనరులు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. తమ పరిశ్రమల విధానాలు చాలా అనుకూలంగా ఉన్నాయని, ఇన్నోవేషన్ వ్యవస్థను ఉత్తేజపరిచే విధంగా ఉంటాయని తెలిపారు. తెలంగాణలో కీలకమైన 14 రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఇండియాను లక్ష్యంగా ఎంపిక చేసుకునే పెట్టబడిదారులకు తెలంగాణ స్వర్గధామంగా నిలుస్తుందని మంత్రి వివరించారు.

ఇండియన్ కాన్స్యూల్ జనరల్ రణధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా అనేక వ్యాపార అంశాల్లో తెలంగాణ, హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయని అన్నారు. మంత్రి కేటీఆర్ చొరవ, చురుకుదన్నాన్ని ఆయన మెచ్చుకున్నారు. తెలంగాణ తమ వినూత్న విధానాలతో హైదరాబాద్‌ను విశ్వవ్యాప్తం చేస్తున్నారని చెప్పారు.

తెలంగాణపై వింగ్ ష్యూర్ ఆసక్తి..

ఇన్స్యూర్ టెక్ కంపెనీ వింగ్ ష్యూర్ వ్యవస్థాపకుడు అవీ బసుతో మంత్రి కేటీఆర్ న్యూయార్క్‌లో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ ఆర్థిక సేవలు అనే అంశంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. రాష్ట్రంలో ఉన్న అవకాశాలను మంత్రి కేటీఆర్ వారికి తెలియజేశారు. చిన్న సన్నకార రైతులు, గ్రామీణ సమాజానికి అవసరమయ్యే వ్యక్తిగత ఇన్స్యూరెన్స్ ఉత్పత్తులు, సలహాలను ఇవ్వడంలో వింగ్ ష్యూర్‌కు మంచి అనుభవం ఉన్నది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అనేక వర్గాలకు ఆర్థిక స్థిరత్యం, సాధికారత వంటి విషయాల్లో సేవలు అందిస్తోంది.

తెలంగాణ ప్రభుత్వంతో ఆరోన్ క్యాపిటల్ డీల్...

తెలంగాణ ప్రభుత్వంతో జట్టు కట్టడానికి మరో అంతర్జాతీయ సంస్థ ఓకే చెప్పింది. ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ కంపెనీ ఆరోన్ క్యాపిటల్‌తో తెలంగాణ సర్కార్ ఒప్పందం కుదుర్చుకున్నది. న్యూయార్క్‌లో ఆరోన్ క్యాపిటల్ చైర్మన్ డేవిడ్ వోల్ఫే నేతృత్వంలోని ఎగ్జిక్యూటీవ్ బృందం మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యింది. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణం గురించి మంత్రి వారికి వివరించారు. ఆవిష్కరణ వ్యవస్థతో పాటు అత్యుత్తమ మౌలిక వసతులు, నైపుణ్యవంతమైన మానవ వనరులు కూడా ఉన్నట్లు తెలిపారు.

ఆరోన్ క్యాపిటల్.. కంపెనీలను విలీనం చేయడం, కొనుగోలు చేయడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఫైనాన్సింగ్, అడ్వైజరీ సేవల్లో ప్రత్యేకతను కలిగి ఉన్నది. అనేక రకాల పరిశ్రమలకు చెందిన క్లయింట్స్ ఆరోన్‌కు ఉన్నారు. మీడియా, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, ఫుడ్ అండ్ బేవరేజెస్, పరిశ్రమలు, టెక్నాలజీ, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లోని సంస్థలు ఆరోన్‌తో అనుబంధం కలిగి ఉన్నారు.


First Published:  18 May 2023 2:42 PM IST
Next Story