Telugu Global
Telangana

ఇతరులవేమో పాపాలు, వాళ్ళవేమో పథకాలు -కేటీఆర్ ట్వీట్

తెలంగాణ ప్రభుత్వం రైతులకు 24 గంటల‌ పాటు ఉచిత విద్యుత్తు ఇవ్వ‌డం పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అయితే ఆయన విమర్శలపై సోషల్ మీడియాలో ఆయనపైనే ట్రోలింగ్ అవుతోంది. బీజెపి 2018 ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మానిఫెస్టోలో ఉన్న ఉచితాలను గుర్తు చేస్తూ మంత్రి కేటీఆర్ కూడా రీ ట్విట్ చేశారు.

ఇతరులవేమో పాపాలు, వాళ్ళవేమో పథకాలు -కేటీఆర్ ట్వీట్
X

ప్రధాని నరేంద్ర మోడీ ఈ మధ్య ఉచిత పథకాల గురించి మాట్లాడినప్పటి నుంచీ బీజేపీ నాయకులంతా విపక్షాలు పాలించేరాష్ట్రాల్లో జరిగే సంక్షేమ కార్యక్రమాల మీద ఆరోపణలకు దిగితున్నారు. కార్పోరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయల‌ అప్పులను మాఫీ చేసే మోడీ పేదలకు మాత్రం ఏదీ ఉచితంగా ఇవ్వంద్దంటూ మాట్లాడుతారు. బీజేపీ పరిపాలించే రాష్ట్రాల్లో పంచే ఉచితాల గురించి మాట మాట్లాడని బీజేపీ నాయకులు విపక్షాలపై విమర్శలు చేస్తూ ఉంటారు. అదే విధంగా కొంత కాలంగా తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ జాతీయ , స్థానిక నేతలు దాడి చేస్తున్నారు. తెలంగాణలో మలవుతున్న సంక్షేమ పథకాలపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజాగా సికిందరాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ''అన్ని ఉచితాలు సంక్షేమ చర్యలు కాదు తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని దుర్వినియోగం చేసి, రాష్ట్రాన్ని భారీ అప్పుల్లో ముంచుతోంది'' అని ట్వీట్ చేశారు. ఇది రైతులకు ఇచ్చే 24 గంటల ఉచిత విద్యుత్తును దృష్టిలో పెట్టుకొని చేసిన విమర్శ.

కిషన్ రెడ్డి , బీజేపీ ఇతర నేతలు , మోడీ ఉచితాలపై మాట్లాడుతున్న మాటల్లో నిజాయితీ ఉన్నదా ? ఒక్క సారి 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తెలంగాణ కోసం విడుదల చేసిన ఎన్నికల మానిఫెస్టోలో ఇస్తామన్న ఉచితాలు చూస్తే కళ్ళూ తిరగక మానదు.

బీజేపీ తెలంగాణ ప్రజలకు ఇస్తానన్న ఉచితాల లిస్ట్

రైతులకు రూ 2లక్షల వరకు రుణమాఫీ.

ప్రతి రైతుకు ఉచిత బోరు లేదా బావి, ఉచిత పంపుసెట్టు.

రైతులకు ఉచితంగా నాణ్యమైన విత్తనాల పంపిణీ.

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పంటల బీమా పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెల్లింపు.

రైతులకు, రైతుకూలీలకు 5 లక్షల రూపాయల వరకు ఉచిత ఆరోగ్య, జీవిత బీమా.

డిగ్రీ విద్యార్థులకు ఉచితంగా లాప్ టాప్ లు

7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బాలికలకు ఉచిత సైకిళ్ల పంపిణీ. డిగ్రీ, ఆ పై స్థాయి విద్యార్థినులకు యాభై శాతం సబ్సిడీతో స్కూటీలు.

2022 నాటికి అర్హులైన పేదలందరికీ ఉచితంగా ఇళ్ల నిర్మాణం. ఇళ్లు నిర్మించి ఇచ్చేవరకు

నెలకు రూ 5వేలు అద్దె చెల్లింపు.

బిపిఎల్ కుటుంబాలలోని 55 సంవత్సరాలు పైబడిన వారికి నెలకు 2,000 రూపాయల

పెన్షన్, వితంతువులకు నెలకు 3,000 రూపాయలు పెన్షన్.

దర్జీలు, రజకులు, నాయిబ్రాహ్మణులు, విశ్వకర్మలు, విశ్వబ్రాహ్మణులు తదితర కులాలవారు నిర్వహించే చేతివృత్తులకు కావలసిన విద్యుత్ ఉచితంగా సరఫరా.

ఇవి బీజేపీ విడుదల చేసిన ఎన్నికల మానిఫెస్టోలో కొన్ని మాత్రమే. మరి వీటిని ఉచితాలు అనకుండా ఏమనాలి. ఇవన్నీ సంక్షేమ పథకాలైతే ప్రస్తుతం టీఆరెస్ చేస్తున్నవి సంక్షేమ పథకాలు ఎందుకు కావు. అవి మాత్రమే ఎందుకు ఉచితాలైపోయాయి?

ప్రస్తుతం ఈ బీజేపీ ఉచితాల ఎన్నికల మానిఫెస్టో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. నెటిజనులు, అటు మోడీపై, ఇటు కిషన్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. కిషన్ రెడ్డి ట్వీట్ తో సహా, బీజేపీ మానిఫెస్టోను టీఆరెస్ ట్విట్ట‌ర్ హ్యాండిల్ ట్వీట్ చేయగా దాన్ని మంత్రి కేటీఆర్ రీ ట్వీట్ చేశారు.

అందులో

''అయ్యా కిషన్ రెడ్డి గారు..

బీజేపీ తెలంగాణ 2018 అసెంబ్లీ ఎన్నికల మానిఫెస్టో మీరే స్వయంగా విడుదల చేసిన విషయం మీరు మర్చిపోయారేమో, మేము ఒకసారి మీకు గుర్తుచేస్తున్నాం.

మీ పార్టీ మానిఫెస్టోలో ఇన్ని ఉచితాలు ప్రకటించి ఇప్పుడు మీరు నీతులు చెప్తున్నారా?'' అని కామెంట్ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం రైతులకు 24 గంటల‌ పాటు ఉచిత విద్యుత్తు ఇవ్వ‌డం పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అయితే ఆయన విమర్శలపై సోషల్ మీడియాలో ఆయనపైనే ట్రోలింగ్ అవుతోంది. బీజెపి 2018 ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మానిఫెస్టోలో ఉన్న ఉచితాలను గుర్తు చేస్తూ మంత్రి కేటీఆర్ కూడా రీ ట్విట్ చేశారు.

First Published:  11 Sept 2022 1:10 PM GMT
Next Story