Telugu Global
Telangana

మునుగోడులో ఫలించిన కేటీఆర్ 'దత్తత' మంత్రం..

మునుగోడు అభివృద్ధికోసం ప్రజలు టీఆర్ఎస్ వెంట నడిచారని తెలుస్తోంది. కేటీఆర్ దత్తత తీసుకుంటే తమ నియోజకవర్గం ముఖచిత్రం మారిపోతుందని ప్రజలు నమ్మారు. అందుకే మునుగోడులో టీఆర్ఎస్ కి పట్టం కట్టారు.

మునుగోడులో ఫలించిన కేటీఆర్ దత్తత మంత్రం..
X

మునుగోడులో టీఆర్ఎస్ విజయం ఖాయమైంది. రాజగోపాల్ రెడ్డి ఓటమి అంగీకరించి తోకముడిచారు. ఇక ఫలితాలను విశ్లేషిస్తే.. ఏడు మండలాల్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం స్పష్టంగా కనపడింది. కేవలం రెండు, మూడు రౌండ్లలో మాత్రమే బీజేపీ స్వల్ప ఆధిక్యం సాధించింది. మిగతా అన్ని రౌండ్లలోనూ టీఆర్ఎస్ కే ఆధిక్యం కనిపిస్తోంది. ఇక ఏడు మండలాల్లో కూడా టీఆర్ఎస్ కి స్పష్టమైన మెజార్టీ రావడం ఈ ఎన్నికల్లో ప్రధాన విశేషం. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ మెజార్టీ ఆశించినా అది సాధ్యం కాలేదు. చౌటుప్పల్, చండూరు మున్సిపాల్టీ ఏరియాల్లో బీజేపీకి మెజార్టీ వస్తుందని ఆ పార్టీ నాయకులు ధీమాగా ఉన్నారు. కానీ చౌటుప్పల్ లో కూడా టీఆర్ఎస్ ఆధిక్యం స్పష్టంగా ఉంది. చండూరులో అన్ని రౌండ్లలో టీఆర్ఎస్ కే ఆధిక్యం వచ్చింది.

ఫలించిన 'దత్తత' మంత్రం..

మునుగోడు ఉప ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ విస్తృతంగా పర్యటించారు. ఎమ్మెల్యేగా ఉన్నా కూడా నాలుగేళ్లపాటు రాజగోపాల్ రెడ్డి మునుగోడుని పట్టించుకోలేదని, టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే తానే ఈ నియోజకవర్గారన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారాయన. ఆ దత్తత మంత్రం ఎన్నికల్లో బాగా పనిచేసిందని అంటున్నారు. మునుగోడు అభివృద్ధికోసం ప్రజలు టీఆర్ఎస్ వెంట నడిచారని తెలుస్తోంది. కేటీఆర్ దత్తత తీసుకుంటే తమ నియోజకవర్గం ముఖచిత్రం మారిపోతుందని ప్రజలు నమ్మారు. అందుకే మునుగోడులో టీఆర్ఎస్ కి పట్టం కట్టారు.

ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైనప్పటినుంచి నియోజకవర్గంపై కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రచారంలో అన్నీ తానై ముందుకు నడిచారు. అభ్యర్థితో కలసి అన్ని మండలాల్లో కలియదిరిగారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ కి పోలింగ్ శాతం తగ్గిన మండలాలపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. మునుగోడు నియోజకవర్గానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమేం చేసిందో వివరించారు. మునుగోడులో ఫ్లోరైడ్ బాధల్ని తరిమి కొట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. రాష్ట్రంలో అత్యథిక రైతుబంధు సాయం అందుకుంటున్న నియోజకవర్గం కూడా మునుగోడేనని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా కూడా ఈ ప్రాంతాన్ని తాము ఎక్కడా తక్కువ చేసి చూడలేదని, ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే, ఇంతకు మించి అభివృద్ది చేసి చూపిస్తామని, తానే స్వయంగా నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. మునుగోడులో టీఆర్ఎస్ విజయానికి బాటలు పరిచారు.

First Published:  6 Nov 2022 5:08 PM IST
Next Story