Telugu Global
Telangana

మూర్ఖపు నిర్ణయాలు మానుకోండి.. కేటీఆర్ హెచ్చరిక

తెలంగాణ అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణం, చార్మినార్ ని తొలగించడం.. ప్రజలు, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు కేటీఆర్.

మూర్ఖపు నిర్ణయాలు మానుకోండి.. కేటీఆర్ హెచ్చరిక
X

కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయాలు మానుకోవాలని, లేకపోతే ప్రజా నిరసన తప్పదని హెచ్చరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ నేతలతో కలసి ఆయన చార్మినార్ ని సందర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టారు. గత పదేళ్లలో జరిగిన మంచిని, అభివృద్ధిని పట్టించుకోకుండా రాజకీయ దుగ్ద, కక్షతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పదేళ్లలో ఎన్నో త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావారణంలో జరగాల్సిందిపోయి ఇలా మూర్ఖపు నిర్ణయాలతో అభాసులాపవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్.


కేసీఆర్ కి పేరు రావొద్దని, కేసీఆర్ పేరు వినపడకూడదనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటోందన్నారు కేటీఆర్. తెలంగాణ అనగానే హైదరాబాద్, వరంగల్ గుర్తొస్తాయని, కాకతీయ సామ్రాజ్యపు వారసత్వ సంపద కాకతీయ కళాతోరణం అని వివరించారు. తెలంగాణ అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణానికి చోటు లేకుండా చేయడం దారుణం అని అన్నారు. చార్మినార్ గుర్తుని కూడా తొలగించాలనుకోవడం మూర్ఖత్వం కాక ఇంకేంటని ప్రశ్నించారు. అధికారిక చిహ్నం నుంచి చార్మినార్‌ను తొలగించడమంటే ప్రతి హైదరాబాదీని అవమానపరచినట్టేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది, మరింత అభివృద్ధి చేసి చూపించాలని కానీ.. ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటారని కాదన్నారు కేటీఆర్.

తెలంగాణ అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణం, చార్మినార్ ని తొలగించడం.. ప్రజలు, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు కేటీఆర్. అసలు ఇప్పటికిప్పుడు చిహ్నాన్ని మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారాయన. ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే విరమించుకోకపోతే తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపడతామన్నారు కేటీఆర్. ప్రభుత్వం ఇప్పటికైనా తన మూర్ఖపు వైఖరి మానుకోవాలని హెచ్చరించారు.

First Published:  30 May 2024 8:01 AM GMT
Next Story