Telugu Global
Telangana

సంక్షేమ పథకాల‌ను రద్దు చేస్తే ఊరుకోం

తమ ప్రభుత్వంలో రోజుకు ఎంతమంది రైతుల ఖాతాల్లో డ‌బ్బు జ‌మ చేశామో అధికారికంగా వివరించామన్నారు కేటీఆర్. ఈ ప్రభుత్వం మాత్రం రైతుబంధు డబ్బులు వేయకుండా జనాన్ని మభ్యపెడుతోందని మండిపడ్డారు.

సంక్షేమ పథకాల‌ను రద్దు చేస్తే ఊరుకోం
X

పేదల కోసం ఉద్దేశించిన అనేక సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పటికే గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసిందన్నారు. దళితబంధు లబ్ధిదారుల ఎంపిక పూర్తయినా దానిపై స్పందించడం లేదన్నారు. దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి.. మరే సంక్షేమ కార్యక్రమాన్ని రద్దు చేసినా ఊరుకోమని హెచ్చ‌రించారు కేటీఆర్. తెలంగాణ భవన్‌లో జరిగిన నిజామాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ సన్నాహక సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

తమ ప్రభుత్వంలో రోజుకు ఎంతమంది రైతుల ఖాతాల్లో డ‌బ్బు జ‌మ చేశామో అధికారికంగా వివరించామన్నారు కేటీఆర్. ఈ ప్రభుత్వం మాత్రం రైతుబంధు డబ్బులు వేయకుండా జనాన్ని మభ్యపెడుతోందని మండిపడ్డారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా, క్యూలైన్లో నిలబెట్టే దుస్థితికి కాంగ్రెస్ వచ్చిందన్నారు. ఏ సంక్షేమ కార్యక్రమాన్ని రద్దు చేసినా ఊరుకోమన్న కేటీఆర్.. లబ్ధిదారులతో కలిసి పోరాటం చేస్తామని రేవంత్ సర్కారును హెచ్చరించారు.

మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలిస్తే BRS పార్టీ ఓట్ల వారీగా నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో మొదటి స్థానంలో ఉందన్నారు కేటీఆర్. కాంగ్రెస్, బీజేపీల కన్నా బీఆర్ఎస్ ముందు వరుసలో ఉందన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం గట్టిగా కొట్లాడితే ఎంపీ ఎన్నికల్లో విజయం తమదే అన్నారు కేటీఆర్.

First Published:  8 Jan 2024 5:37 PM IST
Next Story