CRPF పరీక్షలను అన్ని అధికారిక భాషల్లో నిర్వహించాలి... అమిత్ షాను కోరిన కేటీఆర్
కేటీఆర్ శుక్రవారం అమిత్ షాకు రాసిన లేఖలో, పోటీ పరీక్షలు ఇంగ్లీష్, హిందీలో మాత్రమే జరుగుతున్నాయని, ఇది ఆంగ్ల మాధ్యమంలో చదవని లేదా హిందీ మాట్లాడని రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు తీవ్రమైన నష్టం కలిగిస్తుందని అన్నారు.
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) రిక్రూట్‌మెంట్ పరీక్షలను ఇంగ్లీషు, హిందీలో మాత్రమే నిర్వహించాలని కేంద్రం నిర్ణయించడం సరైనది కాదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ రెండు భాషలపై అవగాహన లేని వారికి ఈ నిర్ణయం నష్టం కలిగిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో సహా ఇతర అధికారిక భాషల్లో కూడా CRPF రిక్రూట్‌మెంట్ పరీక్షలను నిర్వహించాలని కేటీఆర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షానుకోరారు. ఈ మేరకు ఆయన అమిత్ షాకు లేఖ రాశారు.
సిఆర్‌పిఎఫ్‌లో దాదాపు 1.30 లక్షల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం, కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఇంగ్లీష్, హిందీలో మాత్రమే నిర్వహిస్తారు.
కేటీఆర్ శుక్రవారం అమిత్ షాకు రాసిన లేఖలో, పోటీ పరీక్షలు ఇంగ్లీష్, హిందీలో మాత్రమే జరుగుతున్నాయని, ఇది ఆంగ్ల మాధ్యమంలో చదవని లేదా హిందీ మాట్లాడని రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు తీవ్రమైన నష్టం కలిగిస్తుందని అన్నారు.
భారతదేశంలో అనేక అధికారిక భాషలు ఉన్నందున కేవలం హిందీలో పోటీ పరీక్షలను నిర్వహించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, CRPF నోటిఫికేషన్ రాజ్యాంగం హామీ ఇచ్చిన సమాన అవకాశాల హక్కును నిరాకరిస్తున్నదని కేటీఆర్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలన్నీ ప్రాంతీయ భాషల్లోనే నిర్వహించాలని 2020 నవంబర్ 18న ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారని కేటీఆర్ గుర్తు చేశారు.
ప్రాంతీయ భాషల్లో చదువుతున్న కోట్లాది మంది యువత ఎలాంటి వివక్ష, అసమానతలు లేకుండా సమాన అవకాశాలు పొందేలా సీఆర్‌పీఎఫ్ నోటిఫికేషన్‌ను సవరించాలని ఆయన అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు.