మాకు రాముడైనా, కృష్ణుడైనా ఆయనే.. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్
దక్షిణాదిలో ఎన్టీఆర్ సహా ఏ నాయకుడికి కూడా హ్యాట్రిక్ విజయం సాధ్యం కాలేదని, కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ దాన్ని సాధించి చూపిస్తారని అన్నారు మంత్రి కేటీఆర్.
తారక రామారావు అనే పేరులోనే పవర్ ఉందని, ఆ పేరు తనకు ఉండటం, తన చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని అన్నారు మంత్రి కేటీఆర్. తెలుగువారికి ఎన్టీఆర్ ఆరాధ్య దైవం అన్నారు. తెలుగు వారికి రాముడైనా, కృష్ణుడైనా ఆయనేనని చెప్పారు. ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్‌పై రూ.1.37 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పార్క్ ని ఆయన ప్రారంభించారు. ఇందులోనే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎంతో ఆప్తుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు అని చెప్పారు మంత్రి కేటీఆర్. ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన మహా నాయకుడు ఆయన అని కొనియాడారు. రాముడు, కృష్ణుడు నిజంగా ఎలా ఉంటారో తెలియదని, కానీ తెలుగువారందరికీ రాముడైనా, కృష్ణుడైనా ఆయనేనని చెప్పారు.
కేసీఆర్ సాధించి చూపిస్తారు..
దక్షిణాదిలో ఎన్టీఆర్ సహా ఏ నాయకుడికి కూడా హ్యాట్రిక్ విజయం సాధ్యం కాలేదని, కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ దాన్ని సాధించి చూపిస్తారని అన్నారు మంత్రి కేటీఆర్. ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ తెలంగాణ అస్థిత్వాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పారన్నారు. తెలంగాణలో మూడోసారి బీఆర్ఎస్ విజయం ఖాయమని చెప్పారాయన. హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారని చెప్పారు.