ఎక్కడైతే అవమానించబడ్డామో అక్కడే ఆత్మగౌరవ పతాకాన్ని ఎగురవేశాం -కేటీఆర్
జలదృశ్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని కేటీఆర్ ఈ రోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్, ఏ జలదృశ్యం అయితే అవమానకరంగా అప్పటి ప్రభుత్వం కూల్చివేసిందో అక్కడే తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని సమున్నతంగా ఎగురవేశాం అన్నారు.
ఈ రోజు తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని జలదృశ్యంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి కేటీఆర్. ఈ కార్యక్రమం లో ఆయనతో పాటు మంత్రులు శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ తో సహా వినోద్ కుమార్, దానం నాగేందర్, ఎల్.రమణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్....
''ఏ జలదృశ్యంలో అయితే ఉద్యమనాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ ఉద్భవించిందో, ఏ జలదృశ్యం అయితే అవమానకరంగా అప్పటి ప్రభుత్వం కూల్చివేసిందో;
ఈరోజు అక్కడే శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించుకున్నాం. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని సమున్నతంగా ఎగురవేశాం
జై తెలంగాణ'' అని ట్వీట్ చేశారు.
కాగా 2001 లో ఇదే జలదృశ్యంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడింది. అప్పుడు జలదృశ్యంలో ఉన్న తన ఇల్లును కొండలక్ష్మణ్ బాపూజీ ఆ పార్టీకి కార్యాలయం కోసం ఇచ్చారు. అయితే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తెలంగాణ మీద ఉన్న కోపంతో జలదృశ్యంలో ఉన్న ఇల్లును కూల్చి వేసింది. ఇప్పుడు అదే చోట తెలంగాణ ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించింది. అదే విషయాన్ని కేటీఆర్ తన ట్వీట్ లో ఉదహరించారు.