Telugu Global
Telangana

తెలంగాణలో పోలీస్ వ్యవస్థ పనితీరుపై కేటీఆర్ ఘాటు ట్వీట్

తెలంగాణలో కాంగ్రెస్ హయాంలో పోలీసుల పనితీరు ఇలా ఉందని కేటీఆర్ గుర్తు చేస్తూ ఘాటు ట్వీట్ వేశారు.

తెలంగాణలో పోలీస్ వ్యవస్థ పనితీరుపై కేటీఆర్ ఘాటు ట్వీట్
X

తెలంగాణ పోలీస్ వ్యవస్థ పనితీరుకి ఇంతకంటే ఇంకేం నిదర్శనం కావాలని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రెండు వేర్వేరు సంఘటనలను పోల్చి చెబుతూ ఆయన ఓ ట్వీట్ వేశారు. నిజామాబాద్ లో పోలీసుల వేధింపులతో విసిగిపోయిన ఓ స్వీట్ షాప్ యజమాని తన షాపు మూసివేశాడు. మూసివేతకు కారణాన్ని పెద్ద బ్యానర్ లో రాసి షాపు ముందు ఉంచాడు. పోలీసుల వేధింపుల వల్ల తన షాప్ మూసివేశానంటూ బ్యానర్ వేశాడు. తెలంగాణలో కాంగ్రెస్ హయాంలో పోలీసుల పనితీరు ఇలా ఉందని కేటీఆర్ గుర్తు చేశారు.


మరోవైపు వరంగల్‌లో ఏసీపీ స్థాయి అధికారి మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఫొటోని కూడా కేటీఆర్ తన ట్వీట్ కి జతచేశారు. కేక్ కట్ చేసి, పటాకులు పేల్చడంతో రోడ్డుపై ఉన్న నలుగురు అమాయక పౌరులు గాయపడ్డారని, వారిని చికిత్స కోసం MGM ఆసుపత్రికి తరలించారని చెప్పారు. పోలీసులు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం భావ్యమేనా అని ప్రశ్నించారు కేటీఆర్.

రాజకీయ నాయకుల పుట్టినరోజు వేడుకలకు పోలీసులు హాజరవడం అక్కడక్కడా చూస్తూనే ఉంటాం. విధుల్లో ఉన్నవారు బందోబస్తుకి వెళ్తుంటారు, విధులు ముగిసిన తర్వాత కొందరు విందుకి హాజరవుతుంటారు. అయితే విధి నిర్వహణలో ఉండగానే ఏసీపీ నందిరాం నాయక్, మిల్స్ కాలనీ సీఐ మల్లయ్య.. కొండా సురేఖ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం విశేషం. సురేఖ అనుచరులు.. పోలీసులతో కేక్ కట్ చేయించడం మరో విశేషం. వారించాల్సిన పోలీసులే ఉత్సాహంగా బర్త్ డే పార్టీలో పాల్గొని మంత్రి తరపున కేక్ కట్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకు తినిపించారు. పోలీసులు ఇలా బరితెగించి, పార్టీలకు, నేతలకు వంతపాడుతుంటే సామాన్యులకు వారిపై ఎలా నమ్మకం ఉంటుందని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

First Published:  20 Aug 2024 12:35 PM IST
Next Story