Telugu Global
Telangana

ఆ పనులు వెంటనే పూర్తి చేయండి..

SRDP ఫేజ్-3 ద్వారా మూసీ పక్కన ఎక్స్ ప్రెస్ వే, కేబీఆర్ పార్క్ వద్ద అండర్ గ్రౌండ్ టన్నెళ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు, గ్రేడ్ సెపరేషన్ పనులు చేపట్టాల్సి ఉందన్నారు కేటీఆర్.

ఆ పనులు వెంటనే పూర్తి చేయండి..
X

బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో, ప్రత్యేకంగా హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు, కనెక్టింగ్ రోడ్ల నిర్మాణం శరవేగంగా సాగింది. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు, రవాణా సౌకర్యాలను మరింత మెరుగుపరచేందుకు తమ ప్రభుత్వ హయాంలో చిత్తశుద్ధితో కృషి చేశామని అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ చిత్తశుద్ధి కొరవడిందని, ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయని గుర్తు చేశారాయన. ఈ ఏడాదికి పూర్తి కావాల్సిన పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయని చెప్పారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (SRDP)కి అత్యథిక ప్రయారిటీ ఇవ్వాలని కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు.


SRDP ద్వారా హైదరాబాద్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి గతంలో తాము చొరవ తీసుకున్నామని చెప్పారు కేటీఆర్. SRDP ద్వారా కేసీఆర్ ప్రభుత్వం 42 కొత్త ప్రాజెక్టులను ప్రారంభించిందని, వాటిలో 36 విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారాయన. మిగిలిన ప్రాజెక్ట్ లను 2024కి పూర్తయ్యేలా టార్గెట్ పెట్టుకుని తాము పనుల్ని వేగవంతం చేశామన్నారు కేటీఆర్. ప్రభుత్వం మారడంతో ఇప్పుడా పనులు ఆగిపోయాయని గుర్తు చేశారు. గత 8 నెలలుగా సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లకు సకాలంలో చెల్లింపులు కూడా జరగడం లేదని చెప్పారు. SRDP ఫేజ్ -3ని ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు కేటీఆర్.

SRDP ఫేజ్-3 ద్వారా మూసీ పక్కన ఎక్స్ ప్రెస్ వే, కేబీఆర్ పార్క్ వద్ద అండర్ గ్రౌండ్ టన్నెళ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు, గ్రేడ్ సెపరేషన్ పనులు చేపట్టాల్సి ఉందన్నారు కేటీఆర్. ఫేజ్-3కోసం గత ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని, అనుమతులు కూడా మంజూరు చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేస్తే హైదరాబాద్ లో మౌలిక వసతులు మెరుగవుతాయని అన్నారు. తాము మొదలు పెట్టి, దాదాపుగా పూర్తి చేసిన అభివృద్ధి పనుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలన్నారు కేటీఆర్.

First Published:  27 Aug 2024 8:45 AM IST
Next Story