Telugu Global
Telangana

రుణమాఫీ లేదు, రైతుభరోసా లేదు.. అది రిక్తహస్తం

రెండు సీజన్లు దాటినా, రైతుభరోసా ఇంకా షురూ చెయ్యలేదని మండిపడ్డారు కేటీఆర్. కౌలు రైతులకు ఇస్తానన్న రూ.15 వేలు ఇయ్యనే ఇయ్యలేదని, రైతు కూలీలకు రూ.12 వేల హామీ ఇంకా అమలు చెయ్యలేదని విమర్శించారు.

రుణమాఫీ లేదు, రైతుభరోసా లేదు.. అది రిక్తహస్తం
X

కాంగ్రెస్ అంటేనే మొండిచెయ్యి అని మరోసారి తేలిపోయిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో రుణమాఫీ అయిన రైతులకంటే కంటతడి పెట్టిన అన్నదాతల కుటుంబాలే ఎక్కువ అని తేల్చి చెప్పారాయన. అన్నివిధాలా అర్హత ఉన్న రైతులకు కూడా రుణమాఫీ కాలేదని, వారికి అసలు సమస్య ఏంటో, రుణమాఫీ ఎందుకు రాలేదో చెప్పేవారే లేరని అన్నారు. రుణమాఫీ విషయంలో రైతుల్ని వంచించిన కాంగ్రెస్, రైతు భరోసా నిధులు జమ చేయకుండా మోసం చేస్తోందని అన్నారు కేటీఆర్.


రైతుబంధు పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలకు పెట్టుబడి సాయం చేసింది. దాన్ని పెంచి ఇస్తామని, కౌలు రైతులకు, రైతు కూలీలకు కూడా రైతుభరోసా పేరుతో ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చింది కాంగ్రెస్. అధికారంలోకి వచ్చాక రేపు, మాపు అంటూ కాలం గడుపుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఉంటే జూన్ లో రైతుబంధు నిధులు జమ అయ్యేవి. ఇప్పుడు ఆగస్ట్ దాటినా కాంగ్రెస్ సర్కారు కనికరించడంలేదు. రెండు సీజన్లు దాటినా, రైతుభరోసా ఇంకా షురూ చెయ్యలేదని మండిపడ్డారు కేటీఆర్. కౌలు రైతులకు ఇస్తానన్న రూ.15 వేలు ఇయ్యనే ఇయ్యలేదని, రైతు కూలీలకు రూ.12 వేల హామీ ఇంకా అమలు చెయ్యలేదని విమర్శించారు కేటీఆర్.

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో ఉదాసీనంగా ఉందని ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శిస్తోంది. సూపర్ సిక్స్ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. రైతు రుణమాఫీ విషయంలో కూడా సవాళ్లు, ప్రతిసవాళ్లు బలంగా వినిపించాయి. ఈ ఛాలెంజ్ లు రాజీనామాల వరకు వెళ్లాయి. తీరా ప్రభుత్వమే రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదని ఒప్పుకుని ప్రత్యేక యాప్ తీసుకొచ్చి అధికారుల్ని గ్రామాలకు పంపిస్తోంది. ఇక రైతు భరోసా విషయంలో ఇప్పటి వరకు నోరు మెదపకపోవడం మరో విశేషం.

First Published:  26 Aug 2024 1:54 PM IST
Next Story