Telugu Global
Telangana

సత్యమేవ జయతే

సత్యం ఎప్పుడూ గెలుస్తుందని ట్వీట్ వేశారు కేటీఆర్. త్వరలో మేడిగడ్డను సందర్శిస్తామన్నారు.

సత్యమేవ జయతే
X

భారీ వర్షాలకు గోదావరి పొంగి పొర్లుతోంది. మేడిగడ్డ బ్యారేజీ నిండు కుండలా మారింది. ప్రతిసారీ వరదలప్పుడు ఇదే జరుగుతుంది. కానీ ఈసారి ఈ వరద చాలా ప్రత్యేకం అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ కుట్రలను తట్టుకొని నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు అని అభివర్ణిస్తున్నారు. మేడిగడ్డపై ఇప్పటి వరకు జరిగిన దుష్ప్రచారాలన్నీ పటాపంచలయ్యాయని అంటున్నారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సత్యం ఎప్పుడూ గెలుస్తుందని ట్వీట్ వేశారు. త్వరలో మేడిగడ్డను సందర్శిస్తామన్నారాయన.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మేడిగడ్డ పిల్లర్ కుంగిపోయిన ఘటన సంచలనంగా మారింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని, అసలు కాళేశ్వరం ప్రాజెక్టే కొట్టుకుపోతుందన్నట్టుగా వార్తలొచ్చాయి. ఈ ప్రచారాన్ని బీఆర్ఎస్ ఖండించింది. ఇదంతా తప్పుడు ప్రచారం అన్నది. మరమ్మతు చేస్తే సరిపోయేదానికి కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కానీ కాంగ్రెస్ ప్రచారం ఆపలేదు. చివరకు మేడిగడ్డ వ్యవహారం కూడా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిందనే అంచనాలున్నాయి. అయితే ఎన్నికల వేల రాద్ధాంతం చేసిన కాంగ్రెస్, ప్రభుత్వం లోకి వచ్చాక మాత్రం మేడిగడ్డపై తాత్సారం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. మరమ్మతులకోసం కమిటీలు వేశారు కానీ పనులు మొదలు కాలేదు. ఈలోగా గోదావరికి వరద వచ్చింది. మేడిగడ్డ నిండుకుండలా మారింది. పిల్లర్ కుంగిందని అన్నారే కానీ, దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదని తేలిపోయింది. దీంతో బీఆర్ఎస్ ఎదురుదాడి మొదలు పెట్టింది.

ఇప్పటికైనా ప్రజలు కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అర్థం చేసుకోవాలని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ కుల్లుని, కుతంత్రాలను కడిగేస్తూ లక్షల క్యూసెక్కుల వరద నీరు నేడు మేడిగడ్డ వద్ద ప్రవహిస్తోందని చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు జీవధార, సజీవ జలధార అని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. మేడిగడ్డ సామర్థ్యం ఏంటో తెలిసిందని, త్వరలో ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్తామని కేటీఆర్ ట్వీట్ వేశారు.

First Published:  20 July 2024 3:31 AM GMT
Next Story