Telugu Global
Telangana

కేసీఆర్ పాలనలో స్వర్ణయుగం.. కాంగ్రెస్ రాగానే గడ్డుకాలం

సీఎం రేవంత్ మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు మాత్రం సచివాలయం గేటు దాటడం లేదని ఎద్దేవా చేశారు కేటీఆర్.

కేసీఆర్ పాలనలో స్వర్ణయుగం.. కాంగ్రెస్ రాగానే గడ్డుకాలం
X

తెలంగాణలో వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ క్రమంలో సాక్షి పత్రికలో వచ్చిన ఆర్టికల్ ని ఆయన తన ట్వీట్ కి జతచేశారు. గతేడాది ఇదే సమయానికి తెలంగాణలో దాదాపు కోటి ఎకరాల్లో పంట సాగవుతుండగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 84.59 లక్షల ఎకరాల్లోనే పంట వేశారని సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిందని ఆ ఆర్టికల్ సారాంశం. ఇదే విషయాన్ని కేటీఆర్ తన ట్వీట్ లో మరింత విపులంగా వివరించారు.


తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ చేసిన మాయాజాలం వల్ల సాగు విస్తీర్ణం కళ్ళముందే ఢమాల్ అంటూ పడిపోయిందని ఎద్దేవా చేశారు కేటీఆర్. ఒక్క ఏడాదిలోనే 15.30 లక్షల ఎకరాల్లో సాగు ఆగిపోయిందని చెప్పారు. ఆగమైతున్న తెలంగాణ రైతు బతుకుకి ఇది తొలి ప్రమాద సంకేతం అని చెప్పుకొచ్చారు. దశాబ్ద కాలంలోనే దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణలో ఎనిమిది నెలల్లోనే వ్యవసాయ విధ్వంసం మొదలైందని, సంతోషంగా సాగిన సాగులో నేడు సంక్షోభం నెలకొందన్నారు కేటీఆర్. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే కారణం అని చెప్పారు.

మొన్న వ్యవసాయానికి కరెంట్ కట్ చేశారని, నిన్న రుణమాఫీలో రైతుల సంఖ్య కట్ చేశారని.. దీని ఫలితంగా నేడు తెలంగాణలో సాగయ్యే భూమి విస్తీర్ణం కట్ అయిందని చెప్పారు కేటీఆర్. రుణమాఫీ అని మభ్య పెట్టి, రైతుబంధు రూపంలో తమ హయాంలో ఇచ్చిన పెట్టుబడి సాయన్ని ఎగ్గొట్టడం వల్లే రైతులకు ఈ అవస్థ వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు మాత్రం సచివాలయం గేటు దాటడం లేదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకునే విజన్ సీఎం రేవంత్ కి లేదని, రిజర్వాయర్లు నింపే ప్రణాళిక, నీటిని చెరువులకు మళ్లించే తెలివి అసలే లేదన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో రైతు బతుక్కి భరోసాయే లేదన్నారు కేటీఆర్.

First Published:  12 Aug 2024 6:11 AM GMT
Next Story