Telugu Global
Telangana

హైదరాబాద్ కి అరుదైన ఘనత.. మా ప్రయత్నం ఫలించింది

గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 3,866 కోట్లతో మురుగునీటి శుద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాని ఫలితాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయని అంటున్నారు కేటీఆర్.

హైదరాబాద్ కి అరుదైన ఘనత.. మా ప్రయత్నం ఫలించింది
X

రోజుకి 2కోట్ల లీటర్ల మురికి నీటిని శుద్ధి చేస్తున్న తొలి భారతీయ నగరంగా హైదరాబాద్ అరుదైన ఘనత సాధించింది. అధికారికంగా 100 శాతం మురుగు నీటిని శుద్ధి చేస్తున్న నగరంగా హైదరాబాద్ వార్తల్లోకెక్కింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రణాళిక, ప్రయత్నాల ఫలితంగానే తెలంగాణ రాజధానికి ఈ గుర్తింపు దక్కిందని అంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ హయాంలో తాము అమలు చేసిన ప్రణాళికలు సత్ఫలితాలనివ్వడం సంతోషంగా, గర్వంగా ఉందన్నారు.


బీఆర్ఎస్ హయాంలో మురుగునీటి శుద్ధికోసం ప్రత్యేక ప్లాంట్లు ఏర్పాటు చేశారు. నగర ప్రజల ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీటిని శుద్ధి చేసి, ఆ తర్వాతే వాటిని జలాశయాల్లోకి వదిలేవారు. అలా చేయడం వల్ల జలాశయాలు మురికి కాకుండా ఉంటాయి, జలచరాలకు కూడా నష్టం జరగదు. మూసీనది సుందరీకరణ ప్రాజెక్ట్ లో ఇది మొదటి దశగా కూడా చెప్పుకోవచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 3,866 కోట్లతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాని ఫలితాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయని అంటున్నారు కేటీఆర్.

మూసీ సుందరీకరణకు గతంలోనే తాము గ్లోబల్ డిజైన్ టెండర్లు పిలిచామని గుర్తు చేశారు కేటీఆర్. బీఆర్ఎస్ హయాంలో మొదలైన మురుగునీటి శుద్ధి ప్లాంట్ల వీడియోలను ఆయన మరోసారి సోషల్ మీడియాలో షేర్ చేశారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తున్నాయని చెప్పారు.

First Published:  7 July 2024 10:40 AM IST
Next Story