Telugu Global
Telangana

'విజన్' ఉంటే చెప్పండి.. 'డివిజన్' మాత్రం సృష్టించకండి

భావోద్వేగాలు రెచ్చగొట్టకుండా కేంద్రం ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందో చెప్పాలన్నారు కేటీఆర్. సబ్ కా సాత్, అచ్చే దిన్ లాంటి నినాదాలు.. ఎందుకు విధానాలుగా మారలేదో చెప్పాలన్నారు.

విజన్ ఉంటే చెప్పండి.. డివిజన్ మాత్రం సృష్టించకండి
X

ప్రధాని మోదీ ఎన్నికల పర్యటనలో భాగంగా తెలంగాణకు వస్తున్న సందర్భంలో ఆయనకు సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజలకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. ఏం చేశారో చెప్పి, ఏం చేస్తామో వివరించి ఓట్లు అడగాలి కానీ.. దయచేసి తెలంగాణపై విషం చిమ్మకండి అని అన్నారు కేటీఆర్. దేశం కోసం ఏదైనా “విజన్” ఉంటే చెప్పండి..! దయచేసి సమాజంలో “డివిజన్” మాత్రం సృష్టించకండి..!! అని ఎద్దేవా చేశారు.

పిరమైన ప్రధాని మోదీ అంటూ సెటైరిక్ గా తన ట్వీట్ మొదలు పెట్టారు కేటీఆర్. ప్రధానిగా పదేళ్లు గడిచినా.. తెలంగాణ ప్రధాన హామీలను ఎందుకు మరిచారో చెప్పండి..? అని తన ట్వీట్ లో ప్రస్తావించారు కేటీఆర్. తెలంగాణలో కనీసం ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ కైనా కేంద్రం జాతీయ హోదా ఇవ్వలేదని విమర్శించారు. యువతకు ఉపాధినిచ్చే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ఎందుకు పాతరేశారో చెప్పాలని అన్నారు. ఏజెన్సీ బిడ్డలకు బతుకు దెరువునిచ్చే బయ్యారం స్టీలు ఫ్యాక్టరీని ఎందుకు బొందపెట్టారో చెప్పండని అన్నారు కేటీఆర్.

ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ని ఆగం చేశారని, కనీసం ఒక నవోదయ స్కూల్, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐఎం కూడా ఇవ్వలేదన్నారు కేటీఆర్. లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండినా, 200 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నా, కాంగ్రెస్ సర్కారు పాపానికి నేతన్నలు బలైపోతున్నా, తెలంగాణ వైపు ఎందుకు కన్నెత్తి చూడలేదని ప్రశ్నించారు. చేనేత రంగంపై జీఎస్టీ వేసి మగ్గానికి మరణశాసనం రాశారన్నారు. తెలంగాణకు కష్టపడి తెచ్చుకున్న పరిశ్రమలను బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎందుకు తన్నుకుపోతున్నాయో చెప్పాలన్నారు కేటీఆర్.

భావోద్వేగాలు రెచ్చగొట్టకుండా కేంద్రం ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందో చెప్పాలన్నారు కేటీఆర్. సబ్ కా సాత్, అచ్చే దిన్ లాంటి నినాదాలు.. ఎందుకు విధానాలుగా మారలేదో చెప్పాలన్నారు. ఎన్డీఏ పాలనలో పదేళ్లు గడిచినా కూడా ఉచిత రేషన్ అందుకునే 80 కోట్లమంది పేదలు దేశంలో ఉన్నారంటే.. ప్రధానిగా మోదీ విఫలమైనట్టే కదా అని లాజిక్ తీశారు కేటీఆర్. అవినీతిపరులకు బీజేపీలో ఆశ్రయమిచ్చి, రాజకీయ ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కాలరేసే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు కేటీఆర్.

First Published:  7 May 2024 12:36 PM IST
Next Story