అది మీ ఫెయిల్యూరే కదా..? మోదీ పరువు తీసిన కేటీఆర్
డబ్బులు వెళ్లిన మాట నిజం అయితే కాంగ్రెస్ అక్రమాల పుట్ట అని తేలిపోయినట్టే. అదే సమయంలో మోదీ చేతగాని తనం కూడా రుజువైనట్టే. అందుకే మోదీ మాటలకు ఇలా కౌంటర్ ఇచ్చారు కేటీఆర్.
అదానీ, అంబానీ కంపెనీల నుంచి కాంగ్రెస్ కు టెంపోల కొద్దీ డబ్బులు వెళ్తున్నాయని ఇటీవల ప్రధాని మోదీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు. అదే నిజమైతే ఈడీ, ఐటీ, సీబీఐ ఎందుకు సైలెంట్ గా ఉన్నాయని ప్రశ్నించారాయన. వైరి వర్గాలపైకి ఈడీ, ఐటీని పంపించే మోదీ.. అదానీ, అంబానీ నుంచి కాంగ్రెస్ కు అక్రమంగా డబ్బులు తరలి వెళ్తుంటే.. ఆయా సంస్థల్ని వారిపైకి ఎందుకు పంపించలేదని నిలదీశారు. అదే సమయంలో నోట్లరద్దు అనేది విఫల ప్రయోగంగా మిగిలినట్టేనా అని కూడా ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు లావాదేవీలు, హవాలా లావాదేవీలు, బ్లాక్ మనీ అనేవి తగ్గిపోయాయనేది బీజేపీ నేతల వాదన. ఒకవేళ కాంగ్రెస్ కి అదానీ, అంబానీ నుంచి టెంపోలకొద్దీ నగదు వెళ్తే.. నోట్ల రద్దు వల్ల సత్ఫలితం లేనట్టేకదా అని కేటీఆర్ లాజిక్ తీశారు.
As per PM Modi, if Adani & Ambani have been sending Tempoes full of cash to Scamgress, why did his favourite allies ED, IT & CBI stay mum?
— KTR (@KTRBRS) May 9, 2024
Is he also admitting that Demonetisation was a failure ?#JustAsking
అసలు మోదీ ఏమన్నారు..?
గతంలో అదానీ, అంబానీ పేరు చెప్పి మోదీని టార్గెట్ చేసేవారు రాహుల్ గాంధీ. అయితే ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత ఆ తరహా ఆరోపణలు ఆయన చేయలేదని గుర్తు చేశారు ప్రధాని మోదీ. అంటే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కి అదానీ, అంబానీ సంస్థల నుంచి డబ్బులు బాగానే ముట్టాయని అర్థమవుతోందన్నారు మోదీ. టెంపోలకొద్దీ నగదు కాంగ్రెస్ కి వెళ్లిందని ఆయన ఆరోపించారు.
మోదీ ఆరోపణలపై కాంగ్రెస్ స్పందించినా.. అదానీ, అంబానీ సంస్థల నుంచి మాత్రం ఖండన ప్రకటనలేవీ విడుదల కాలేదు. అయితే కేటీఆర్ మాత్రం ఈ వ్యవహారంలో కాంగ్రెస్, బీజేపీ రెండిట్నీ కార్నర్ చేశారు. డబ్బులు వెళ్లిన మాట నిజం అయితే కాంగ్రెస్ అక్రమాల పుట్ట అని తేలిపోయినట్టే. అదే సమయంలో మోదీ చేతగాని తనం కూడా రుజువైనట్టే. అందుకే మోదీ మాటలకు ఇలా కౌంటర్ ఇచ్చారు కేటీఆర్.