Telugu Global
Telangana

మోదీ చట్టానికి అతీతులా..? ఎన్నికల కమిషన్ ఉందా, లేదా..?

జీహాదీ ఓటు బ్యాంక్ అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మోదీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఎన్నికల కమిషన్ పనితీరుని ప్రశ్నించారు కేటీఆర్.

మోదీ చట్టానికి అతీతులా..? ఎన్నికల కమిషన్ ఉందా, లేదా..?
X

కేసీఆర్ వ్యాఖ్యల కారణంగా ఆయన ప్రచారంపై ఎన్నికల కమిషన్ 48 గంటల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ఏం మాట్లాడారు, ఆయన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయా, రావా అనే విషయాన్ని పక్కనపెడితే.. అసలు ప్రధాని మోదీ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు..? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎంతలా జనాల్ని రెచ్చగొడుతున్నారు..? ప్రతిపక్ష నేతల్ని ఎంత నీఛంగా సంబోధిస్తున్నారనే విషయం చర్చనీయాంశంగా మారింది. వారిద్దరి మాటల్ని ఎన్నికల కమిషన్ ఎందుకు పట్టించుకోవడంలేదనే విమర్శలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మోదీ వ్యాఖ్యలకు కౌంటర్ గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ వేశారు.

మోదీ ఏమన్నారు..?

దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల గురించి గొడవ జరుగుతోంది. ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్లు తీసేసి, వాటిని ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామని చెబుతున్నారు అమిత్ షా. దాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. 400 సీట్లు గెలుస్తామంటున్న ఎన్డీఏ.. మొత్తానికి మొత్తంగా రిజర్వేషన్లు ఎత్తివేసే దుర్మార్గపు ఆలోచన చేస్తోందని, ఎన్డీఏకి అత్యధిక మెజార్టీ వస్తే కచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చేస్తారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ నేపథ్యంలో తాజాగా రిజర్వేషన్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. రాజ్యాంగాన్ని మార్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటాని తీసేసి జీహాదీ ఓటు బ్యాంక్ కి కట్టబెడుతుందని విమర్శించారు. ప్రధాని స్థాయిలో ఉన్న నాయకుడు జీహాదీ ఓటు బ్యాంక్ అంటూ ఓ వర్గాన్ని కించపరచడం సంచలనంగా మారింది.


ఎన్నికలంటే చాలు బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతుంది. టార్గెట్ 400 అంటూ రెచ్చిపోతున్నా.. ఈసారి ఎన్డీఏకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అందుకే పదే పదే మత విద్వేషాలను రెచ్చగొట్టేలా బీజేపీ నేతలు ప్రచారంలో ప్రసంగాలిస్తున్నారు. మోదీ, అమిత్ షా కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ అమిత్ షా నేరుగా చెబుతుంటే... మోదీ మరో అడుగు ముందుకేసి జీహాదీ ఓటు బ్యాంక్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా మోదీ వ్యాఖ్యలను నెటిజన్లు ఖండిస్తున్నారు. వివిధ పార్టీలు ఆయన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కేటీఆర్ కూడా మోదీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఎన్నికల కమిషన్ పనితీరుని ప్రశ్నించారు.

First Published:  3 May 2024 3:06 PM IST
Next Story