పదేళ్లలో ఇలాంటి అరాచకం ఎప్పుడైనా చూశారా..?
బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తేవి కాదని, ఇప్పుడు ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట అల్లర్లు జరుగుతున్నాయని విమర్శించారు కేటీఆర్.
నో 'లా', నో 'ఆర్డర్'.. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు ట్వీట్ వేశారు. గత పదేళ్లలో ఎప్పుడైనా ఇలాంటి అర్థంలేని వ్యవహారాలు తెలంగాణలో జరిగాయా అని సూటిగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తేవి కాదని, ఇప్పుడు ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట అల్లర్లు జరుగుతున్నాయని అంటున్నారాయన. గతంలో కూడా తెలంగాణ శాంతి భద్రతల అంశంపై ఆయన సోషల్ మీడియా ద్వారా తన ఆవేదన వెలిబుచ్చారు. మత కల్లోలాలకు కాంగ్రెస్ ప్రభుత్వం కారణం అవుతోందన్నారు. తాజాగా మియాపూర్ ఘటనను ప్రస్తావిస్తూ కేటీఆర్ ట్వీట్ వేశారు.
No Law No Order
— KTR (@KTRBRS) June 23, 2024
Have you ever seen such nonsense in last 10 years? https://t.co/nd4LP6P72n
మియాపూర్ లో ఏం జరిగింది..?
మియాపూర్ దీప్తిశ్రీనగర్‌లో శనివారం ఉద్రిక్తత నెలకొంది. శేరిలింగంపల్లి మండలం మియాపూర్ పరిధిలోని 100, 101 సర్వే నెంబర్లలో దాదాపు 504 ఎకరాల HMDA భూమి ఉంది. ఇక్కడ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తుందని స్థానికంగా ప్రచారం సాగింది. దీంతో పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దాదాపు 2 వేల మంది అక్కడ తాత్కాలికంగా గుడిసెలు వేసుకున్నారు. వాటిని తొలగించేందుకు అధికారులు ప్రయత్నించగా పేదలు మాత్రం వెనక్కి తగ్గలేదు. చివరకు పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులపై కొంతమంది రాళ్లు వేయడంతో లాఠీచార్జ్ జరిగింది. కొందరికి గాయాలయ్యాయి.
అది ప్రభుత్వ భూమి అని తెలియక గతంలో కొంతమంది అమాయకులు మోసగాళ్ల వలలో చిక్కుకున్నారు. దాన్ని కొనుగోలు చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లు కోర్టు కేసులు నడిచాయి. కోర్టు తీర్పుతో ఆ భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. కొందరు సుప్రీంకోర్టుని ఆశ్రయించగా, మిగిలిన వారిలో కొందరు పేదలను రెచ్చగొట్టి ఇలా గుడిసెలు వేసుకునేలా ప్రోత్సహించారని అంటున్నారు. చివరకు ఈ వ్యవహారం శాంతి భద్రతల సమస్యగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనకు ఈ ఘటన నిదర్శనం అని బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కేటీఆర్ కూడా ట్విట్టర్లో కాంగ్రెస్ పాలన - శాంతి భద్రతల అంశంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.