Telugu Global
Telangana

అవార్డు సరే.. నిధుల సంగతేంటి..? -కేటీఆర్

అవార్డు ఇస్తున్నందుకు సంతోషం, నిధులిస్తే మరీ సంతోషం అంటూ కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. మిషన్ భగీరథకు నీతి ఆయోగ్ సిఫారసు చేసిన నిధులను ఎందుకు ఇవ్వలేదని కేంద్రాన్ని నిలదీశారు.

అవార్డు సరే.. నిధుల సంగతేంటి..?  -కేటీఆర్
X

మిషన్‌ భగీరథ పథకానికి కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించడపై మంత్రి కేటీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. అదే సమయంలో మిషన్ భగీరథకు నీతి ఆయోగ్ సిఫారసు చేసిన నిధులను ఎందుకు ఇవ్వలేదని కేంద్రాన్ని నిలదీశారు. ఆ నిధులు కూడా ఇస్తే ఇంకా సంతోషం అంటూ కేంద్రానికి చురకలంటించారు కేటీఆర్.

తెలంగాణలో ఇంటింటికీ మంచినీటిని అందిస్తున్న మిషన్‌ భగీరథ పథకం కేంద్ర ప్రభుత్వ జల్‌ జీవన్‌ మిషన్‌ పురస్కారానికి ఎంపికైంది. మిషన్ భగీరథ పథకం.. నాణ్యత, ప్రమాణాలలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని, అన్ని గ్రామాలలో ఇంటింటికీ నల్లా కనెక్షన్ల ద్వారా నాణ్యమైన తాగునీరు అందిస్తున్నట్లు తెలిపింది కేంద్రం. ఈ ఘనత సాధించడం వల్లే జల్ జీవన్ మిషన్ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిన కేంద్రం, అక్టోబరు 2న ఢిల్లీలో జరిగే వేడుకల్లో ఈ అవార్డు అందుకోవాలని కోరింది. ఈ నేపథ్యంలో కేంద్రానికి ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేసిన కేటీఆర్ ఆ నిధుల సంగతేంటి అని ప్రశ్నించారు.


అటు విమర్శలు, ఇటు ప్రశంసలు..

తెలంగాణకు వచ్చిన కేంద్ర మంత్రులు చాలా సందర్భాల్లో మిషన్ భగీరథపై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కమీషన్ల ప్రాజెక్ట్ అంటూ విమర్శించారు. బీజేపీ తెలంగాణ నేతలకు కూడా మిషన్ భగీరథ అంటే కడుపుమంట. తాగు, సాగునీటి కష్టాలను తీర్చిన కాళేశ్వరం అంటే ఇంకా ఎక్కువ ఉక్రోషం. అందుకే పదే పదే ఆయా పథకాలపై విమర్శలు చేస్తుంటారు, తమ అక్కసు వెళ్లగక్కుతుంటారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కేంద్ర మంత్రులు మిషన్ భగీరథను విమర్శించినా, కేంద్రం మాత్రం ఆ పథకాన్ని అద్భుతం అంటూ ప్రశంసించింది. పురస్కారానికి ఎంపిక చేసింది.

విచిత్రం ఏంటంటే.. మిషన్ భగీరథలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ లకు కేంద్రం ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. కాళేశ్వరంకు జాతీయ హోదా ఇవ్వాలన్న డిమాండ్లను కూడా బుట్టదాఖలు చేసింది. మిషన్ భగీరథకు 19వేల కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేయాలంటూ నీతి ఆయోగ్ చేసిన సిఫారసులను కూడా కేంద్రం పట్టించుకోలేదు. నిధులివ్వకుండా సహాయ నిరాకరణ చేస్తూ అవార్డులిస్తే ఉపయోగమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ కూడా అవార్డు ఇస్తున్నందుకు సంతోషం, నిధులిస్తే మరీ సంతోషం అంటూ తనదైన శైలిలో స్పందించారు.అవార్డు సరే.. నిధుల సంగతేంటి..? -కేటీఆర్

First Published:  29 Sept 2022 4:15 PM GMT
Next Story