Telugu Global
Telangana

అమెరికాలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రసంగించనున్న మంత్రి కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఈ విజయాలపై అంతర్జాతీయ వేదికపై ప్రసంగించే అవకాశం రావడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

అమెరికాలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రసంగించనున్న మంత్రి కేటీఆర్
X

తెలంగాణ వరప్రదాయినిగా పిలుచుకునే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా గర్వకారణం. ఒకప్పుడు బీడువారిన తెలంగాణ నేల.. పచ్చదనం సంతరించుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్య కారణం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. కాళేశ్వరం సహా ఎన్నో ప్రాజెక్టులకు రూప కల్పన చేసి.. సాగునీటి అవసరాలను తీరుస్తోంది. అలాగే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాల ద్వారా నీటిని అందిస్తోంది. తెలంగాణ రాష్ట్రం సాగు, తాగు నీటిలో సాధించిన ఈ అద్భుత విజయాలు దేశానికే దిక్సూచిలా మారాయి.

రాష్ట్రం సాధించిన ఈ విజయాలపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో ప్రసంగించనున్నారు. నెవెడా రాష్ట్రంలోని హెండర్‌సన్‌లో అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ నిర్వహించే వరల్డ్ ఎన్విరాన్‌మెంటల్ అండ్ వాటర్ రీసోర్సెస్ కాంగ్రెస్‌లో పాల్గొనాలని కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళ్వేశ్వరం‌తో పాటు మిషన్ భగీరథ పథకంపై మాట్లాడాలని నిర్వాహకులు కోరారు. సాగు, తాగునీటి పథకాల్లో తెంగాణ సాధించిన విజయాలపై ప్రెజెంటేషన్ ఇవ్వాలని కోరారు.

కాగా, తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఈ విజయాలపై అంతర్జాతీయ వేదికపై ప్రసంగించే అవకాశం రావడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఒకప్పుడు కరువుతో అల్లాడిన నేల ఇప్పుడు పచ్చగా మారడం వెనుక సీఎం కేసీఆర్ విజన్ ఉందని మంత్రి కొనియాడారు. సాగు, తాగు నీటి పథకాలను తొలి ప్రాధాన్యతగా తీసుకోవడం వల్లే ఈ విజయం సాధ్యమైందని అన్నారు. తెలంగాణ విజయాలను వివరించడానికి ఈ వేదికను ఉపయోగించుకుంటానని చెప్పారు. కాగా, మంత్రి కేటీఆర్ అమెరికాలోని ఐదు రాష్ట్రాల్లో పర్యటించి.. రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకొని వచ్చే సమావేశాల్లో పాల్గొననున్నారు. ప్రముఖ కంపెనీల చైర్మన్లు, సీఈవోలతో చర్చలు జరపనున్నారు.


First Published:  17 May 2023 8:38 AM IST
Next Story