Telugu Global
Telangana

సెటైర్లు, పంచ్ డైలాగుల్లో బావ‌ను మించిపోతున్న కేటీఆర్

కేటీఆర్ కాంగ్రెస్‌నూ వ‌ద‌ల‌ట్లేదు. కేసీఆర్ కాళేశ్వ‌రం ప్రాజెక్టుతో క‌రువు ప్రాంతాల్లో నీళ్లు పారించార‌ని, కాంగ్రెస్ వ‌స్తే మ‌ళ్లీ శ‌నే అంటూ.. `కేసీఆర్ అంటే కాళేశ్వ‌రం.. కాంగ్రెస్ అంటే శ‌నీశ్వ‌రం` అని పంచ్ పేల్చారు

సెటైర్లు, పంచ్ డైలాగుల్లో బావ‌ను మించిపోతున్న కేటీఆర్
X

బీఆర్ఎస్ ర‌థానికి హ‌రీష్‌రావు, కేటీఆర్ జోడు గుర్రాలు. రాజ‌కీయ వ్యూహాల్లో, జ‌నాన్ని ఆక‌ట్టుకోవ‌డంలో వారిద్ద‌రూ ఎవ‌రికి వారే సాటి. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ వారిద్ద‌రూ గ‌త కొన్ని నెలలుగా చేస్తున్న ప్ర‌సంగాలు ప్రాస‌ల‌తో, పంచ్ డైలాగుల‌తో జ‌నాన్ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు హ‌రీష్‌రావు ఒక్క‌రే ప్రాసల‌తో, పంచ్‌ల‌తో ప్ర‌తిప‌క్షాల‌ను టార్గెట్ చేస్తే ఆయ‌న‌కు తోడుగా ఇప్పుడు కేటీఆర్ కూడా ప‌వ‌ర్ ఫుల్ పంచ్‌లతో విప‌క్షాల‌ను ఉతికి ఆరేస్తున్నారు.

కేసీఆర్ అంటే న‌మ్మకం.. మోడీ అంటే అమ్మ‌కం

రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే రెండుసార్లు తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ప్ర‌ధాని మోడీని టార్గెట్ చేస్తూ కేటీఆర్ ప్రాస‌ల‌తో, ప‌వ‌ర్ ఫుల్‌ పంచుల‌తో విరుచుకుప‌డ్డారు. తెలంగాణ‌ను అభివృద్ధి చేయ‌డానికి అన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తున్న కేసీఆర్ అంటేనే ప్ర‌జ‌లకు న‌మ్మకం అని.. మ‌రోవైపు ప్ర‌ధాని మోడీది అన్నింటి అమ్మ‌కం అంటూ మోడీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా కేటీఆర్ కామెంట్ చేశారు. ప్ర‌ధాని మొండి చేతుల‌తో వ‌చ్చి.. తొండి చేసి వెళ్తారు అనీ సైటైర్ వేశారు.

కేసీఆర్ అంటే కాళేశ్వ‌రం.. కాంగ్రెస్ అంటే శ‌నీశ్వ‌రం

కేటీఆర్ కాంగ్రెస్‌నూ వ‌ద‌ల‌ట్లేదు. కేసీఆర్ కాళేశ్వ‌రం ప్రాజెక్టుతో క‌రువు ప్రాంతాల్లో నీళ్లు పారించార‌ని, కాంగ్రెస్ వ‌స్తే మ‌ళ్లీ శ‌నే అంటూ.. `కేసీఆర్ అంటే కాళేశ్వ‌రం.. కాంగ్రెస్ అంటే శ‌నీశ్వ‌రం` అని పంచ్ పేల్చారు ధ‌ర్మ‌పురి స‌భ‌లో కేటీఆర్‌. కేసీఆర్ పాల‌న‌లో తెలంగాణ దూసుకుపోతుంద‌ని చెబుతూ విప‌క్షాల‌కు అధికార‌మిచ్చి ఆగ‌మ‌వుతారో.. కేసీఆర్‌ను గెలిపించి ప్ర‌గ‌తిలో భాగ‌మ‌వుతారో తేల్చుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కూ ప్రాస‌తోనే విజ్ఞ‌ప్తి చేశారు.

First Published:  4 Oct 2023 11:40 AM IST
Next Story