Telugu Global
Telangana

రైతులను చెప్పుతో కొడతామంటారా..? కాంగ్రెస్ ని ఓటుతో కొడతాం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మూడోవంతు సీట్లను ఇచ్చి బలమైన ప్రతిపక్షంగా పనిచేయాలని ప్రజలు బీఆర్‌ఎస్‌ను ఆదేశించారని చెప్పారు కేటీఆర్.

రైతులను చెప్పుతో కొడతామంటారా..? కాంగ్రెస్ ని ఓటుతో కొడతాం
X

రైతుబంధు అడిగితే చెప్పుతీసి కొడతామంటున్న కాంగ్రెస్ నేతల్ని.. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఓటుతో కొట్టాలని పిలుపునిచ్చారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2 లక్షల వరకు రుణ మాఫీ చేస్తామని రేవంత్‌ రెడ్డి చెప్పారని, ఇప్పటికీ అది అమలుకాలేదన్నారు. రుణం తెచ్చుకున్న రైతులకు మొండి చేయి చూపించారని విమర్శించారు. డిసెంబర్‌ 9న రుణమాఫీ ఫైలుపై సంతకం చేస్తామని చెప్పిన రేవంత్.. తాము ప్రభుత్వంలో ఉన్నామనే విషయాన్ని మరచిపోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మార్పు పేరుతో తెలంగాణ ప్రజల్ని కాంగ్రెస్ మోసం చేసిందన్నారు కేటీఆర్. చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మూడోవంతు సీట్లను ఇచ్చి బలమైన ప్రతిపక్షంగా పనిచేయాలని ప్రజలు బీఆర్‌ఎస్‌ను ఆదేశించారని చెప్పారు కేటీఆర్. రాష్ట్రంలో రైతులు సహా ఏ వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లను సర్కారు గోసపెడుతోందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా 24 గంటల కరెంటు సరఫరా కావడం లేదన్నారు. కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తారని ప్రశ్నించారు కేటీఆర్.

కాంగ్రెస్ కార్యకర్తలా గవర్నర్ ప్రసంగం..

రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ గవర్నర్‌ ప్రసంగం సామాన్య కాంగ్రెస్‌ కార్యకర్త ప్రసంగం కంటే హీనంగా ఉందన్నారు కేటీఆర్. కాంగ్రెస్‌ పార్టీ 420 హామీలిచ్చిందని, ఆ హామీలను అమలు చేయకుంటే బట్టలిప్పి నిలబెడతామన్నారు. నోటికొచ్చిన హామీలిచ్చి ఇరుక్కుపోయారని, ఇప్పుడు కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ ఐదేళ్లు అధికారం నిలుపుకుంటుందో లేదో వేచి చూద్దామన్నారు కేటీఆర్. పార్లమెంట్ ఎన్నిల కోడ్‌ రాకముందే హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారాయన. కాంగ్రెస్‌ బెదిరింపులకు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు భయపడొద్దని సూచించారు. ఎలాంటి కష్టం వచ్చినా తాము అండగా నిలబడతామన్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ త్వరలో ప్రజల్లోకి వస్తారని భరోసా ఇచ్చారు కేటీఆర్.

First Published:  29 Jan 2024 11:17 AM GMT
Next Story