Telugu Global
Telangana

మోదీ సింగరేణిని మింగేయాలనుకున్నారు

ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేటలో ఈరోజు మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావుని గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక్కడి కార్యకర్తల జోష్ చూస్తుంటే మళ్ళీ వనమా గెలుపు ఖాయం అనిపిస్తోందన్నారు.

మోదీ సింగరేణిని మింగేయాలనుకున్నారు
X

తెలంగాణ ఉద్యమంలో ఢిల్లీ మెడలు వంచడంలో ముందున్నది కొత్తగూడెం సింగరేణి ప్రాంతం అని చెప్పారు మంత్రి కేటీఆర్. సింగరేణిని మింగేయాలని మోదీ అనుకుంటున్నారని, సింగరేణిని కాపాడుకోవాలంటే గులాబీ జెండా వల్లే అది సాధ్యమవుతుందని చెప్పారు. కొత్తగూడెంకు విమానాశ్రయం తీసుకురావాలని ప్రయత్నిస్తే మోదీ అడ్డుకున్నారని చెప్పారు. 2024లో మోదీని ఇంటికి పంపిస్తే.. ఇక్కడకు విమానాశ్రయం వస్తుందన్నారు కేటీఆర్.


ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేటలో ఈరోజు మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావుని గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక్కడి కార్యకర్తల జోష్ చూస్తుంటే మళ్ళీ వనమా గెలుపు ఖాయం అనిపిస్తోందన్నారు. సింగరేణి బతకాలంటే కేసీఆర్ రావాలి - వనమా గెలవాలి అన్నారు కేటీఆర్.

కొత్తగూడెంలో పోటీ విచిత్రంగా ఉంది. 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన వనమా వెంకటేశ్వరరావు ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి వచ్చారు. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న జలగం వెంగట్రావు నొచ్చుకున్నారు. 2023లో వనమానే బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడంతో జలగం పార్టీకి దూరమయ్యారు. ఇక ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ రెండూ పోటీలో లేకపోవడం మరో విశేషం. పొత్తులో భాగంగా కాంగ్రెస్ ఈ సీటుని సీపీఐకి కేటాయించింది. ఆ పార్టీ తరపున కూనంనేని సాంబశివరావు ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ కూడా ఇక్కడ పోటీ చేయడంలేదు, ఆ స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించింది. జనసేన తరపున లక్కినేని సురేంద్రరావు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ పోటీలో లేకపోవడంతో ఇక్కడ బీఆర్ఎస్ గెలుపు ధీమా రెట్టింపయింది.

First Published:  19 Nov 2023 5:29 PM IST
Next Story