Telugu Global
Telangana

రివర్ ఫ్రంట్ పేరుతో బ్యాక్‌ డోర్ బాగోతం - కేటీఆర్‌

మూసీ ప్రాజెక్టుతో మురిసే రైతులెందరు.. నిల్వ ఉంచే టీఎంసీలెన్ని.. సాగులోకి వచ్చే ఎకరాలెన్నంటూ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు KTR. పెరిగే పంటల దిగుబడి, తీరే పారిశ్రామిక అవసరాలు ఎన్నో చెప్పాలన్నారు.

రివర్ ఫ్రంట్ పేరుతో బ్యాక్‌ డోర్ బాగోతం - కేటీఆర్‌
X

మూసీ సుందరీకరణ కోసం రూ.లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక గతంలో ఈ ప్రాజెక్టు కోసం గతంలో రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తామని, ఇటీవల 70 వేల కోట్లని.. తాజాగా లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పడంపై అనుమానాలు వ్యక్తం చేశారు కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు ఖర్చు చేస్తేనే కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా గగ్గోలు పెట్టిందన్నారు. అలాంటిది మరీ మూసీ సుందరీకరణకు లక్షా 50 వేల కోట్లా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు కేటీఆర్. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.


ఇక మూసీ ప్రాజెక్టుతో మురిసే రైతులెందరు.. నిల్వ ఉంచే టీఎంసీలెన్ని.. సాగులోకి వచ్చే ఎకరాలెన్నంటూ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు KTR. పెరిగే పంటల దిగుబడి, తీరే పారిశ్రామిక అవసరాలు ఎన్నో చెప్పాలన్నారు. కొత్తగా ఎన్ని భారీ రిజర్వాయర్లు నిర్మిస్తారో చెప్పాలన్నారు కేటీఆర్. ఇక పుట్టిన గడ్డపై మమకారం లేని ముఖ్యమంత్రికి.. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకన్నా.. మూసీ ప్రాజెక్టుపైనే ఎందుకింత మక్కువో చెప్పాలన్నారు. చివరి దశలో ఉన్న ప్రాజెక్టును పక్కన పెట్టి.. మూసీ చుట్టే ఎందుకింత మంత్రాంగమన్నారు. లండన్‌లోని థేమ్స్‌ నదిలా మారుస్తామనే వ్యూహం వెనుక థీమ్ ఏంటన్నారు. గేమ్ ప్లాన్‌ ఏంటని ప్రశ్నించారు కేటీఆర్.

మూడింతలు పెంచిన మూసీ అంచనా వ్యయం కాంగ్రెస్ ధన దాహానికి సజీవ సాక్ష్యమన్నారు కేటీఆర్. మూసీ ప్రాజెక్టును చేపట్టాల్సిందేనన్న కేటీఆర్.. కానీ మాటల దశలోనే ఉన్న ప్రాజెక్టులో మూటలు పంచుకునే పని షురూ చేస్తే సహించమన్నారు. తట్టెడు మన్ను తీయకముందే కోట్లు తన్నుకుపోయే కుట్రకు తెరతీస్తే భరించేది లేదన్నారు కేటీఆర్. మూసీ రివర్ ఫ్రంట్ పేరిట బ్యాక్‌ డోర్‌లో జరుగుతున్న బాగోతాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు కేటీఆర్‌. కుంభకోణాల కాంగ్రెస్‌కు కర్రుగాల్చి వాతపెడుతుందన్నారు.

First Published:  21 July 2024 9:39 AM GMT
Next Story