Telugu Global
Telangana

మారింది పేరు మాత్రమే.. లోపల ఒరిజినల్ అలానే ఉంది

పోరాడి రాష్ట్రాన్ని సాధించిన వారికే అధికారం కట్టబెడితే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు ఓట్లేశారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూనే ఉంటామని అన్నారు కేటీఆర్.

మారింది పేరు మాత్రమే.. లోపల ఒరిజినల్ అలానే ఉంది
X

టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మారింది కానీ.. పార్టీ డీఎన్ఏ అలాగే ఉందని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. జెండా, అజెండాలో ఎలాంటి మార్పు లేదని అన్నారు. సిరిసిల్లలో నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ ప్లీనరీలో పాల్గొన్న ఆయన.. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం చారిత్రక అవసరం అని చెప్పారు. గోల్‌మాల్‌ గుజరాత్‌ కాదు.. గోల్డెన్‌ తెలంగాణ నమూనాను దేశానికి పరిచయం చేసేందుకే బీఆర్ఎస్ ఆవిర్భవించిందన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆనాటి టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్ ఆవిర్భవించి 22 ఏళ్లు పూర్తవుతోందని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్. ఆనాడు కేసీఆర్‌ కు పేరు, ప్రతిష్ట, మీడియా బలం, ఏవీ లేవని.. కేవలం ప్రజలకు ఆయనపై ఉన్న విశ్వాసమే.. పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చిందన్నారు. ఉద్యమం నుంచి తప్పుకొంటే రాళ్లతో కొట్టండి అని ధీమాగా చెప్పిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. ఆ మాటకు కట్టుబడే ఆయన తెలంగాణ సాధించే వరకు అలుపెరగకుండా శ్రమించాడని గుర్తు చేశారు కేటీఆర్. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెళ్తున్నా.. తెలంగాణతో తిరిగి వస్తానని ధైర్యంగా చెప్పిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. పోరాడి రాష్ట్రాన్ని సాధించిన వారికే అధికారం కట్టబెడితే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు ఓట్లేశారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూనే ఉంటామని అన్నారు కేటీఆర్.


సిరిసిల్ల.. అభివృద్ధి ఖిల్లా

తెలంగాణ ఏర్పాటయ్యాక సిరిసిల్ల ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు కేటీఆర్. డిగ్రీ కాలేజీ కూడా లేని సిరిసిల్లలో ఇప్పుడు మెడికల్ కాలేజీ సహా ఇంజినీరింగ్, ప్రైవేటు యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. పక్క నియోజకవర్గాలు, ప్రతిపక్షాలు అసూయ పడే విధంగా సిరిసిల్లను అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. అభివృద్ధి చెందిన తెలంగాణ మోడల్‌ ను దేశం మొత్తం అమలు చేయడమే బీఆర్ఎస్ ప్రధాన లక్ష్యం అని వివరించారు కేటీఆర్.

అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌.. అని మహారాష్ట్ర రైతులు నేడు గర్జిస్తున్నారని చెప్పారు కేటీఆర్. ప్రధాని మోదీ చేసిన గోల్‌ మాల్‌ ను దేశమంతటికీ వివరించాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కనుమరుగయ్యే రోజు త్వరలోనే వస్తుందన్నారు కేటీఆర్.

First Published:  25 April 2023 9:45 PM IST
Next Story