క్రొయేషియా ఆటగాళ్లపై కేటీఆర్ సెటైరికల్ ట్వీట్.. వాళ్లు మన హైదరాబాదీలే అంటూ..
క్రొయేషియా జట్టుపై కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ వదిలారు. క్రొయేషియా ఆటగాళ్లకే నా సపోర్ట్ ఉంటుంది.. ఎందుకో తెలుసా అంటూ లాజిక్ కూడా చెప్పారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో చాలా యాక్టీవ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే. రాజకీయాలు, ప్రభుత్వ సంబంధిత కార్యక్రమాలను తన ట్వీట్ల ద్వారా తెలియజేస్తారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై చూపిస్తున్న వివక్షను, మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ట్వీట్లు చేస్తారు. ఎవరికైనా సాయం కావాలంటే కేటీఆర్‌ను ట్విట్టర్‌లో అడుగుతుంటారు. ఆయన కూడా ఆ ట్వీట్ చూడగానే రెస్పాండ్ అవుతారు. అయితే అప్పుడప్పుడు కాస్త సెటైరికల్ ట్వీట్లు కూడా ఉంటాయి. సినిమాలు, ఆటలకు సంబంధించిన విషయాలను కూడా ప్రస్తావిస్తారు.
ఖతర్ వేదికగా ప్రస్తుతం ఫుట్‌బాల్ ప్రపంచ కప్ జరగుతోంది. శుక్రవారం రాత్రి రెండు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జరిగాయి. మొదటిగా క్రొయేషియా-బ్రెజిల్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలో క్రొయేషియా జట్టుపై కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ వదిలారు. క్రొయేషియా ఆటగాళ్లకే నా సపోర్ట్ ఉంటుంది.. ఎందుకో తెలుసా అంటూ లాజిక్ కూడా చెప్పారు. 'నేను క్రొయేషియా టీమ్‌కు సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే.. మీలో చాలా మందికి క్రొయేషియన్ జట్టులో ఉన్న కొందరు ఆటగాళ్లకు హైదరాబాద్‌తో సంబంధం ఉన్న విషయం తెలియదు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ విషయం ఆ ఆటగాళ్లకు కూడా తెలియదు. కానీ మనం మాత్రం ఆ విషయాన్ని ఈజీగా కనిపెట్టేయవచ్చు. ఎందుకంటే వాళ్ల పేర్లు ఇనిచ్, ఉనిచ్, ఇదరిచ్, ఉదరిచ్, ఐసాయిచ్, వైసాయిచ్' అని ఉన్నాయంటూ ట్వీట్ చేశారు.
హైదరాబాదీ ఉర్దూ మిక్స్ చేసి చాలా మంది యువత ఇక్కడ ఇలాగే మాట్లాడుతుంటారు. అతను, ఇతను, అలాగా, అక్కడ అనే పదాలను ఊర్దూలో మాట్లాడినట్లుగానే క్రొయేషియన్ ఆటగాళ్ల పేర్లు ఉన్నట్లు కేటీఆర్ సెటైర్ వేశారు. క్రొయేషియన్ జట్టులోని చాలా మంది ఆటగాళ్ల పేర్లు విచ్, ఇచ్ అనే ఎండింగ్ ఉంటుంది. అందుకే కేటీఆర్ అలా ట్వీట్ చేశారు. కాగా, శుక్రవారం రాత్రి బ్రెజిల్‌తో క్రొయేషియన్ జట్టు నువ్వా నేనా అన్నట్లు తలపడింది. రెండు జట్లు పూర్తి సమయం ముగిసినా ఒక్క గోల్ కూడా చేయలేదు. ఎక్స్‌ట్రా టైంలో ఇరు జట్లు 1-1తో నిలిచాయి. దీంతో పెనాల్టీ షూటౌట్ ద్వారా విజేతను నిర్ణయించారు. క్రొయేషియా జట్టు 4-2 తేడాతో బ్రెజిల్‌ను ఓడించి సాకర్ వరల్డ్ కప్ -2022లో సెమీస్ బెర్త్ సాధించిన తొలి జట్టుగా నిలిచింది.
క్రొయేషియా గెలిచిన తర్వాత తన ట్వీట్‌ను రీట్వీట్ చేసి.. మొత్తానికి మన హైదరాబాద్ అబ్బాయిలు గెలిచారు. ఇక నెక్ట్స్ అర్జెంటీనా, మెస్పీ గెలవాలని కోరుకుంటున్నాను అన్నారు. అన్నట్లుగానే తర్వాత మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై అర్జెంటీనా విజయం సాధించి సెమీస్ చేరింది.