Telugu Global
Telangana

ఆస్కార్ ఇవ్వాల్సిందే.. రాహుల్ గాంధీపై కేటీఆర్ సెటైర్లు

ద్వంద్వ ప్రమాణాలు రాహుల్ గాంధీకే సొంతం అని విమర్శించారు. నాటు నాటు పాట తర్వాత రాహుల్ కే ఆస్కార్ రావాలని సెటైర్లు పేల్చారు కేటీఆర్.

ఆస్కార్ ఇవ్వాల్సిందే.. రాహుల్ గాంధీపై కేటీఆర్ సెటైర్లు
X

తెలంగాణలో ఫిరాయింపు రాజకీయాలు జోరందుకున్నాయి. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఒక్కొక్కరినే కాంగ్రెస్ లాగేసుకుంటోంది. పార్టీ మారడాన్ని బీఆర్ఎస్ తప్పుబట్టలేదు కానీ, రాజీనామాలు చేయకుండా ఇలా ప్రజా ప్రతినిధులు పార్టీలు మారడం సరికాదంటోంది. గతంలో బీఆర్ఎస్ లోకి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చారు కానీ, వారంతా మూకుమ్మడిగా వచ్చేసి లేజిస్లేటివ్ పార్టీని విలీనం చేశారు. అది రాజ్యాంగబద్ధంగానే జరిగింది, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఫిరాయింపుల విషయంలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందని అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.


కాంగ్రెస్ ద్వంద వైఖరి..

కాంగ్రెస్ నేతల్ని బీజేపీ లాగేసుకుంటే.. అప్పుడు హస్తం పార్టీ బాధిత కార్డు ప్లే చేస్తుందని, అదే కాంగ్రెస్ ఇతర పార్టీల నేతల్ని లాగేసుకునేటప్పుడు మాత్రం ఆ నీతి సూత్రాలు గుర్తుకు రావా అని ప్రశ్నించారు కేటీఆర్. కర్నాటక, గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీజేపీని తప్పుబడుతున్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్ కొనుగోలుని ఎందుకు సమర్థిస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. ఈ ద్వంద్వ ప్రమాణాలు రాహుల్ గాంధీకే సొంతం అని విమర్శించారు. నాటు నాటు పాట తర్వాత రాహుల్ కే ఆస్కార్ రావాలని సెటైర్లు పేల్చారు కేటీఆర్.

మీ బండారం బయటపెడతాం..

కాంగ్రెస్ కపటత్వాన్ని జాతీయ స్థాయిలో అందరి దృష్టికీ తీసుకెళ్తామని హెచ్చరించారు కేటీఆర్. న్యాయం కోసం ఢిల్లీలో అన్ని రాజ్యాంగబద్ధ సంస్థలను కలుస్తామన్నారు. రేవంత్‌రెడ్డి తన ప్రభుత్వాన్ని పూర్తి కాలం నడపాలని, పరిపాలనపైనే ఆయన దృష్టి పెట్టాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. మీకు జరిగింది అన్యాయం అనుకుంటే, ఇతరుల విషయాల్లో అదే అన్యాయం చేస్తామని అనడం న్యాయమేనా అని అడిగారు కేటీఆర్.

First Published:  9 July 2024 1:48 PM GMT
Next Story