Telugu Global
Telangana

3 పంటలా..? 3 గంటలా..? మతం పేరిట మంటలా..?

నాడు వ్యవసాయం దండగ అని చంద్రబాబు అంటే, నేడు మూడు పూటల కరెంటు దండగ అని ఛోటా చంద్రబాబు అంటున్నారని రేవంత్ రెడ్డిని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్.

3 పంటలా..? 3 గంటలా..? మతం పేరిట మంటలా..?
X

తెలంగాణ ప్రజలకు, రైతాంగానికి ఇప్పుడు మూడు ఛాయిస్ లు కళ్లెదుట ఉన్నాయని, వాటిలో ఏది కావాలో తేల్చుకోవాల్సిన తరుణం వచ్చిందని అన్నారు మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ విధానం మూడు పంటలని, కాంగ్రెస్ విధానం 3 గంటల విద్యుత్ అని, బీజేపీ విధానం మతం పేరిట మంటలు అని ట్వీట్ చేశారు కేటీఆర్. తెలంగాణ రైతు తేల్చుకోవాల్సిన తరుణం ఇదని చెప్పారు.


రెండో ప్రమాద హెచ్చరిక.. !!

కాంగ్రెస్ నోట..రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక.. అంటూ మరో ట్వీట్ వేశారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ వస్తే ధరణి తీసేస్తామంటూ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారని, ఆ తర్వాత ఇప్పుడు మూడు గంటలే కరెంటు అంటూ రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయిందని అన్నారు. నాడు వ్యవసాయం దండగ అని చంద్రబాబు అంటే, నేడు మూడు పూటల కరెంటు దండగ అని ఛోటా చంద్రబాబు అంటున్నారని రేవంత్ రెడ్డిని ఎద్దేవా చేశారు. మూడు ఎకరాల రైతుకు, మూడుపూటలా కరెంట్ ఎందుకు అనడం, ముమ్మాటికీ సన్న, చిన్నకారు రైతును అవమానించడమేనని చెప్పారు.


కాంగ్రెస్ నోట్లు తప్ప రైతుల పాట్లు తెలియవని, రాబందుని నమ్మితే రైతు నోట్లో మట్టి ఖాయమని చెప్పారు కేటీఆర్. నాడు ఏడు గంటలు కరెంటు ఇవ్వకుండా ఎగ్గొట్టిన కాంగ్రెస్, నేడు ఉచిత కరెంటుకి ఎగనామం పెట్టే కుట్ర చేస్తోందని అన్నారు. మూడుగంటలతో 3 ఎకరాల పొలం పారించాలంటే బక్కచిక్కిన రైతు బాహుబలి మోటార్లు పెట్టాలని, అది సాధ్యం కాదని అన్నారు. అరికాలిలో మెదడు ఉన్నోళ్లను నమ్మితే రైతుల బతుకు ఆగమైపోయుందని చెప్పారు. తెలంగాణ రైతన్నలకు ఇది పరీక్షా సమయం అని, రైతును రాజును చేసే మనసున్న ముఖ్యమంత్రి KCR కావాలా ? 3 గంటలు కరెంటు చాలన్న మోసకారి రాబందు కావాలా ?? రైతులు తేల్చుకోవాలన్నారు మంత్రి కేటీఆర్.

First Published:  12 July 2023 12:13 PM IST
Next Story