కొత్త రేషన్ కార్డులు.. సన్నబియ్యం.. - అధికారంలోకి రాగానే అందిస్తాం
బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. 2014లో రూ.400 ఉన్న సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1200 అయ్యిందని గుర్తుచేశారు.
బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఇప్పటికే రేషన్ కార్డు ఉన్నవారికి సన్న బియ్యం ఇస్తామని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ చెబుతున్న అబద్ధాలు నమ్మొద్దని కేటీఆర్ ప్రజలకు సూచించారు. అప్పట్లో రూ.200 పింఛను ఇచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పడు రూ.4 వేలు ఇస్తామంటున్నారని.. వారి మాటలు నమ్ముతామా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే 3 గంటలకే కరెంట్ వస్తుందని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.
గ్యాస్ సిలిండర్ రూ.400కే...
బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. 2014లో రూ.400 ఉన్న సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1200 అయ్యిందని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే తిరిగి రూ.400కే సిలిండర్ అందిస్తామని హామీఇచ్చారు. అలాగే.. తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.73 వేల కోట్లను జమ చేసిందని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేశారు. కేసీఆర్ పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సాకారమైందని, ఆయన దీక్షతో కేంద్రం దిగివచ్చి తెలంగాణ ప్రకటించిందని, ఈ నేపథ్యంలో ఈసారి కూడా నవంబర్ 29న దీక్షాదివస్ నిర్వహిస్తామని స్పష్టంచేశారు. బీఆర్‌ఎస్ శ్రేణులు ఎక్కడివారు అక్కడ దీక్షాదివస్ నిర్వహించాలని, సేవా కార్యక్రమాలు చేపట్టాలని, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.