Telugu Global
Telangana

కేటీఆర్ రెడీ.. తెలంగాణను నడిపించేది ఆయనేనంటూ కామెంట్స్.. అసలు విషయం ఇదే

సాధారణంగా అసెంబ్లీలో అయినా, బయట అయినా ఎప్పుడూ కూల్‌గా కనిపించే కేటీఆర్.. ప్రతిపక్షాలకు సమాధానం ఇచ్చే సమయంలో మాత్రం ధీటుగా, గంభీరంగా స్పందించారు.

కేటీఆర్ రెడీ.. తెలంగాణను నడిపించేది ఆయనేనంటూ కామెంట్స్.. అసలు విషయం ఇదే
X

'ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క.. అన్న వస్తున్నాడు', 'దేశ్ కీ నేత కేసీఆర్.. తెలంగాణ నేత కేటీఆర్'.. ఇవి నిన్న అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ స్పీచ్ తర్వాత సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన వ్యాఖ్యల్లో కొన్ని. అసెంబ్లీలో గతంలో ఎన్నడూ చూడని, వ్యవహరించని తీరుకు భిన్నంగా కేటీఆర్ చాలా కీలకమైన పాత్రను పోషించారు. బడ్జెట్ సమావేశాల తొలి రోజు గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. ఈ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం ఉభయ సభల్లో చర్చ జరిగింది. సాధారణంగా సభా నాయకుడైన సీఎం కేసీఆర్ అధికారికంగా మాట్లాడాలి. కానీ కేసీఆర్ సభకు రాకపోవడంతో ఆ బాధ్యతను కేటీఆర్ భుజానికి ఎత్తుకున్నారు.

ఇప్పటి వరకు కేసీఆర్ గైర్హాజరీలో కేటీఆర్ ఎప్పుడూ ఇలా వ్యవహరించలేదు. గతంలో సీఎం ఆబ్సెంట్ అయితే ప్రభుత్వం తరపున శాసన సభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి లేదంటే విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆ బాధ్యతలు తీసుకునేవారు. కానీ, ఈ సారి కేటీఆర్ అంతా తానై నడిపించారు. సాధారణంగా అసెంబ్లీలో అయినా, బయట అయినా ఎప్పుడూ కూల్‌గా కనిపించే కేటీఆర్.. ప్రతిపక్షాలకు సమాధానం ఇచ్చే సమయంలో మాత్రం ధీటుగా, గంభీరంగా స్పందించారు. శనివారం కేటీఆర్ స్పీచ్ చూసిన వాళ్లు.. ఒక వేళ కేసీఆర్ ఉంటే కూడా ఇంత గట్టిగా సమాధానం చెప్పేవారో లేదో అనే వ్యాఖ్యాలు చేయడం గమనార్హం. కేసీఆర్ అయితే తనదైన శైలిలో పంచులు వేస్తూ సమాధానం చెప్పేవారేమో కానీ.. కేటీఆర్ మాత్రం ప్రభుత్వంపై అభాండాలు వేస్తున్న బీజేపీకి కరెక్ట్ రిప్లయ్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు.

అసెంబ్లీ లాబీల్లో ఈటల, రఘునందన్ రావు, రాజా సింగ్‌లతో కలిసి నవ్వుతూ కనిపించిన కేటీఆర్.. లోపలకు వెళ్లి నాయకత్వ బాధ్యతలు తీసుకోగానే.. వ్యవహరించిన తీరు మారిపోయింది. బయట ఫ్రెండ్సేమో కానీ, ప్రభుత్వంపై విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నట్లుగా వ్యవహరించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే శనివారం అసెంబ్లీలో కేటీఆర్ వన్ మ్యాన్ షో నడిచిందనే చెప్పుకోవచ్చు. అసెంబ్లీ చర్చల సమయంలో ప్రతిపక్షాలు ఆటంకం కలిగిస్తే స్వయంగా కేటీఆరే కల్పించుకొని వారిని వారించడం గమనార్హం. మొత్తానికి సభా నాయకుడి మాదిరిగా, పరిణితితో వ్యవహరించడం చూసి ప్రతిపక్ష నాయకులు కూడా ఆశ్చర్యపోయారు.

మజ్లిస్ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్, సీఎల్పీ లీడర్ భట్టి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, రాజాసింగ్‌లకు కాస్త గట్టిగానే సమాధానం చెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవం విషయంలో రాజీ పడేదే లేదంటూ అందరి మనసులను గెలుచుకున్నారు. ఇవన్నీ గమనించిన తర్వాత ఇక కేటీఆర్ రాష్ట్రాన్ని నడిపించడానికి పూర్తిగా సిద్ధం అయ్యాడని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇక తెలంగాణ భవిష్యత్ కేటీఆర్ అన్నే.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సీఎం కేసీఆర్ ఇప్పుడు పూర్తిగా జాతీయ రాజకీయాలపైనే దృష్టి పెట్టారు. బీఆర్ఎస్ పార్టీ విస్తరణ కార్యక్రమాలతో ఆయన బిజీగా ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ రాష్ట్రంపై ఫోకస్ చేస్తున్నారు. సీనియర్లను, నాయకులను సమన్వయం చేసుకుంటూ ఇప్పటికే పార్టీపై పూర్తి పట్టు సాధించారు. ఎప్పటికప్పుడు బీజేపీ, కాంగ్రెస్‌లకు కౌంటర్ ఇస్తూ.. రాబోయే ఎన్నికల్లో పార్టీని సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఎక్కడెక్కడ పార్టీలో వర్గ విభేదాలు ఉన్నాయో.. వాటిని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తూ, సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఇలా ఇప్పటికే పార్టీ పరంగా ఒక బలమైన నేతగా నిరూపించుకున్న కేటీఆర్.. తాజాగా అసెంబ్లీలో ప్రతిపక్షాలను ఎదుర్కోవడంలోనూ సఫలం అయ్యారు. ఒక నాయకుడిగా ఆయన ఎదిగినట్లే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన వీడియో ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. గతంలో ఎక్కువగా బీఆర్ఎస్ సోషల్ మీడియా సభ్యులో, పార్టీ అభిమానులో ఇలాంటి వీడియోలను వైరల్ చేసే వారు.కానీ ఇప్పడు పార్టీతో సంబంధం లేని వ్యక్తులు, అసలు రాజకీయాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించని వాళ్లు కూడా కేటీఆర్ వీడియోపై పాజిటివ్‌గా స్పందించడం గమనార్హం. కేటీఆర్ రెడీ అంటూ కామెంట్ చేస్తున్నారు. తెలంగాణను నడిపించే నాయకుడిగా కేటీఆర్ సిద్ధం అయ్యారనే వాదనకు గత రెండు రోజుల అసెంబ్లీ సమావేశాలే సాక్ష్యం అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

First Published:  5 Feb 2023 11:15 AM IST
Next Story