బడ్జెట్ పై కేటీఆర్ రియాక్షన్.. సీఎం రేవంత్ పై ఘాటు వ్యాఖ్యలు
ఆరు గ్యారెంటీల్లో ఏది అమలు చేయకపోయినా ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రతి కరెంటు మీటర్‌కు 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు కేటీఆర్.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రజలకు తీవ్ర నిరాశ మిగిల్చిందని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కనీసం ఆరు గ్యారెంటీలకు బడ్జెట్ లో కేటాయింపులు లేవన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదం అన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి.. బుడ్డర్ ఖాన్ లా మాట్లాడుతున్నారని సెటైర్లు పేల్చారు. సనత్ నగర్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన తెలంగాణ బడ్జెట్ పై స్పందించారు.
కేటాయింపులు సగం కూడా లేవు..
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే బడ్జెట్ లో రూ.1.25 లక్షల కోట్లు అవసరమవుతాయని అన్నారు కేటీఆర్. కానీ కేటాయింపులు చూస్తే అందులో సగం కూడా లేవన్నారు. బడ్జెట్ లో గ్యారెంటీల అమలు కోసం కేవలం రూ.53 వేల కోట్ల మాత్రమే కేటాయించారని విమర్శించారు.
నల్లగొండ సభతో సత్తా చూపిస్తాం..
తెలంగాణ జల హక్కులను కృష్ణాబోర్డుకు అప్పగించడాన్ని నిరసిస్తూ ఈనెల 13న నల్లగొండలో తలపెట్టిన సభను భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని చెప్పారు కేటీఆర్. ప్రజా బలం ఏంటో చూపిస్తామన్నారు. కాంగ్రెస్ పై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతకు ఆ సభ నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఆరు గ్యారెంటీల్లో ఏది అమలు చేయకపోయినా ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రతి కరెంటు మీటర్‌కు 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు కేటీఆర్.