Telugu Global
Telangana

విధానం లేదు, విషయం లేదు, విజన్ లేదు

వాగ్దానాలను గాలికొదిలేసిన వంచనల బడ్జెట్ ఇదని అన్నారు కేటీఆర్. డిక్లరేషన్లను బుట్టదాఖలు చేసిన దోకేబాజ్ బడ్జెట్ అని విమర్శించారు.

విధానం లేదు, విషయం లేదు, విజన్ లేదు
X

ప్రజల ఆకాంక్షలను పట్టించుకోని ఆంక్షల పద్దుగా తెలంగాణ బడ్జెట్ ని అభివర్ణించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ బడ్జెట్ కి ఒక విధానం లేదని, బడ్జెట్ లో విషయం లేదని, విజన్ ఏమాత్రం లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను గంగలో కలిపేసిన కోతల.. ఎగవేతల బడ్జెట్ ఇది అంటూ ట్విట్టర్లో సెటైర్లు పేల్చారు కేటీఆర్.


వాగ్దానాలను గాలికొదిలిన వంచనల బడ్జెట్ ఇదని అన్నారు కేటీఆర్. డిక్లరేషన్లను బుట్టదాఖలు చేసిన దోకేబాజ్ బడ్జెట్ అని చెప్పారు. కేవలం పథకాల పేర్లు మార్చారని, బడ్జెట్ అంతా డొల్ల మాత్రమేనని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ పద్ధులో రైతులకు కత్తిరింపులు పెట్టారని, అన్నదాతలకు సున్నం చుట్టారని మండిపడ్డారు. ఆడబిడ్డలకు అన్యాయం చేశారని, మహాలక్ష్ములకు మహామోసం జరిగిందన్నారు. పెన్షన్ల పెంపు అనే మాటే ఎత్తలేదని, అవ్వాతాతలను, దివ్యాంగులను, నిరుపేదలను, నిస్సహాయులను మోసం చేశారన్నారు కేటీఆర్.

తాజా బడ్జెట్ లో అంబేద్కర్ అభయహస్తం పథకం ప్రస్తావనే లేదని, దళితులకు, గిరిజనులకు దగా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. వృత్తి కులాలపై కాంగ్రెస్ సర్కారు కత్తి కట్టిందని, బడుగు బలహీన వర్గాలకు భరోసా ఊసే లేదని, మైనార్టీలను కూడా మోసం చేశారని అన్నారు. నిరుద్యోగ భృతి గురించి ఎందుకు ప్రస్తావించలేదని సూటిగా ప్రశ్నించారు. విద్యార్థులపై కూడా వివక్షే చూపించారన్నారు. నేతన్నకు చేయూత లేకుండా చేశారని, ఆత్మహత్యలపాలైన ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలన్న మానవీయ కోణం కూడా కాంగ్రెస్ నేతల్లో లేదని విమర్శించారు. కాంగ్రెస్ బడ్జెట్ ని పసలేని, దిశలేని దండగ మారి బడ్జెట్ గా అభివర్ణించారు కేటీఆర్.

First Published:  25 July 2024 12:32 PM GMT
Next Story