Telugu Global
Telangana

తీవ్ర నిరాశ, కానీ..! ఫలితాలపై కేటీఆర్ స్పందన

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఒక్క సీటు కూడా రాకపోవడం నిరాశ కలిగించిందన్న కేటీఆర్, ఇలాంటి ఎదురుదెబ్బలకు వెనక్కి తగ్గేది లేదన్నారు.

తీవ్ర నిరాశ, కానీ..! ఫలితాలపై కేటీఆర్ స్పందన
X

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ పార్టీ ఊహలకు అందకుండా ఉన్నాయి. తెలంగాణ కల సాకారం చేసిన ఉద్యమ పార్టీకి లోక్ సభలో స్థానం లేకుండా పోయింది. రాష్ట్రంలోని 17 స్థానాల్లో ఒకటి ఎంఐఎంకి పోగా మిగతా స్థానాలను కాంగ్రెస్, బీజేపీ చెరోసగం పంచుకున్నాయి. బీఆర్ఎస్ ఒక్క స్థానంలో కూడా గట్టి పోటీ ఇవ్వలేకపోవడం విశేషం. అయితే ఈ ఫలితాలతో తాము డీలా పడ లేదని హుందాగా ప్రకటించారు కేటీఆర్. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల్లో బోణీ కొట్టలేకపోవడం.. ఇలా వరుసగా ఊహించని ఫలితాలు వస్తున్నా.. బీఆర్ఎస్ వెనక్కి తగ్గేది లేదంటున్నారాయన. ఫీనిక్స్ పక్షిలాగా తిరిగి పైకి లేవడం తమకు అలవాటేనన్నారు.

బీఆర్ఎస్ స్థాపించి 24 ఏళ్లవుతోందని, ఇప్పటి వరకు అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నామని, గొప్ప విజయాలు చూశామని, అనేక ఎదురుదెబ్బలు కూడా తగిలాయని చెప్పారు కేటీఆర్. అయితే తెలంగాణ రాష్ట్ర సాధన గొప్ప విజయంగా మిగిలిపోతుందన్నారాయన. లోక్ సభ ఎన్నికల ఫలితాల గురించి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రాంతీయ పార్టీ అయిఉండి కూడా వరుసగా రెండు సార్లు తెలంగాణలో అధికారంలోకి వచ్చామని, మూడోసారి కూడా గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు సాధించామన్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నామని వివరించారు.


నిరాశే, కానీ..!

ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఒక్క సీటు కూడా రాకపోవడం నిరాశ కలిగించిందన్న కేటీఆర్, ఇలాంటి ఎదురుదెబ్బలకు వెనక్కి తగ్గేది లేదన్నారు. మరింత కష్టపడి పనిచేస్తామని, ప్రజల పక్షాన నిలబడతామని, ఫీనిక్స్ పక్షిలా తిరిగి పైకెగురుతామని చెప్పారు కేటీఆర్.

First Published:  4 Jun 2024 4:28 PM IST
Next Story