Telugu Global
Telangana

చెప్పేవి నీతులు, చేసేవి..

జంప్ జిలానీల భరతం పడతా అని భారీ డైలాగులు కొట్టిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఏ ప్రలోభాలను ఎర వేస్తున్నారు? ఏ ప్రయోజనాలు ఆశిస్తున్నారు? అని ప్రశ్నించారు కేటీఆర్.

చెప్పేవి నీతులు, చేసేవి..
X

తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వరుసబెట్టి కాంగ్రెస్ లోకి తీసుకెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా తప్పుబట్టేవారు. పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టి చంపాలనేవారు. పదవులకు రాజీనామాలు చేయకుండా పార్టీలు మారిన వారిని ఊళ్లనుంచి తరిమి కొట్టాలనేవారు. అదే రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి రాగానే ఇతర పార్టీల నేతల్ని గేలమేసి లాక్కెళ్తున్నారని తీవ్రంగా తప్పుబట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. "ముఖ్యమంత్రి గారూ..! ప్రచారంలో నీతులు..? ప్రభుత్వంలోకి వచ్చాక నీతిమాలిన పనులా..?" అంటూ సూటిగా ప్రశ్నించారు.

"నాడు..

ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడం నేరమన్నారు.

ప్రలోభాలకు లొంగి పార్టీ ఫిరాయించడం ఘోరమన్నారు.

భుజాలపై మోసిన కార్యకర్తల పాలిట తీరని ద్రోహమన్నారు.

మరి ఇవాళ మీరే..

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి మరీ..

కాంగ్రెస్ కండువాలు కప్పి కప్పదాట్లను ప్రోత్సహిస్తారా ?" అని ట్వీట్ చేశారు కేటీఆర్.


జంప్ జిలానీల భరతం పడతా అని భారీ డైలాగులు కొట్టిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఏ ప్రలోభాలను ఎర వేస్తున్నారు? ఏ ప్రయోజనాలు ఆశిస్తున్నారు? అని ప్రశ్నించారు కేటీఆర్. ఇప్పుడు ఎవరిని రాళ్లతో కొట్టాలని, ఎవరికి రాజకీయంగా గోరీ కట్టాలని అడిగారు. తన ప్రశ్నలకు రేవంత్ రెడ్డి జవాబు చెప్పాల్సిందేనన్నారు కేటీఆర్.

First Published:  25 Jun 2024 8:37 PM IST
Next Story