ఆ పరికరాలకు ఏమైంది..? కేటీఆర్ సూటి ప్రశ్న
ప్రమాదాలు జరగకుండా హెచ్చరించాల్సిన వ్యవస్థకు, సంబంధిత పరికరాలకు ఏమైందని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఇది నిజంగా ఎన్నడూ జరగకూడని విషాదం అని అన్నారు.
గంటలు గడిచేకొద్దీ ఒడిశా రైలు ప్రమాదం తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. 280మంది ప్రయాణికులు మరణించడం, వెయ్యిమందికి పైగా గాయపడటంతో ప్రపంచ దేశాలు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. అందరినోటా ఒకటే ప్రశ్న. అసలీ ప్రమాదానికి కారణం ఏంటి..? అత్యాథునిక సాంకేతిక వ్యవస్థలు వచ్చిన తర్వాత కూడా ఇంత ఘోరం జరిగిందంటే నమ్మశక్యంగా లేదు. రైలు పట్టాలు తప్పిందంటే ఓ అర్థముంది. పట్టాలు తప్పిన రైలు పక్క ట్రాక్ పై పడిపోతే దాన్ని గుర్తించలేక మరో రైలు ఢీకొన్నదంటే సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలున్నట్టు అర్థం చేసుకోవాలి. ప్రమాదాలు జరిగినప్పుడు ఆటోమేటిక్ గా స్పందించే వ్యవస్థలు మన దగ్గర ఇంకా మెరుగవ్వాల్సిన పరిస్థితి ఉంది. కవచ్ వ్యవస్థ ఆ రూట్లో అందుబాటులో లేదంటూ రైల్వే అధికారులు తాజాగా వివరణ ఇచ్చారు.
బాలాసోర్ లో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ప్రియమైన వారిని కోల్పోయిన ప్రయాణీకుల కుటుంబాలకు, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ప్రమాదాలు జరగకుండా హెచ్చరించాల్సిన వ్యవస్థకు, సంబంధిత పరికరాలకు ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఇది నిజంగా ఎన్నడూ జరగకూడని విషాదం అని అన్నారాయన.
Aghast at the horrific train collision that killed 233 passengers and left many more wounded
— KTR (@KTRBRS) June 3, 2023
My heartfelt condolences & prayers to all the families of the passengers who lost their loved ones and those affected
What happened to the Anti Collision Devices ? This is indeed a…
దేశ విదేశాలనుంచి సంతాప సందేశాలు..
ఒడిశా రైలు ప్రమాదంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తన హృదయాన్ని కలిచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి సానుభూతి తెలిపారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో భారత పౌరులకు కెనడియన్లు అండగా ఉంటారని పేర్కొన్నారు. తైవాన్ ప్రెసిడెంట్ ట్సాయి ఇంగ్ వెన్ కూడా మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఆస్ట్రేలియా, శ్రీలంక విదేశాంగ మంత్రులు కూడా స్పందించారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు రష్యా అంబాసిడర్ డెనిస్ అలిపొవ్ సానుభూతి తెలిపారు. ఇక కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రయాణించే రాష్ట్రాల నేతలు కూడా ఈ ఘటన తర్వాత తమ అధికారుల్ని అలర్ట్ చేశారు. తమ తమ రాష్ట్రాలకు చెందిన వారికి తక్షణ సహాయం చేయాలని కోరారు. ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రుల వివరాలు సేకరిస్తున్నారు.