Telugu Global
Telangana

అర కొర కాదు.. 100శాతం ఎప్పుడు చేస్తారో చెప్పండి

డెడ్ లైన్ లేకుండా రుణమాఫీ చేశామని, చేసేశామని, ఇంకా పూర్తి కాలేదని.. ఇలా ఒక్కో నాయకుడు ఒక్కో రకంగా మాట్లాడటం సరికాదన్నారు కేటీఆర్.

అర కొర కాదు.. 100శాతం ఎప్పుడు చేస్తారో చెప్పండి
X

రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో కార్నర్ చేస్తోంది ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ. సిక్స్ గ్యారెంటీస్ అంటూ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, కనీసం ఒక్క హామీ అయినా పూర్తి స్థాయిలో నెరవేర్చకపోవడమేంటని నిలదీస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పిల్లిమొగ్గలు వేస్తోందని మండిపడ్డారు. పూర్తిగా రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి చెబుతుంటే, ఆర్థిక మంత్రి 7వేల కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ జరిగినట్టు లెక్కలు చెబుతున్నారని అన్నారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రుణమాఫీ ఎప్పుడు చేస్తుందో చెప్పి తీరాలన్నారు కేటీఆర్.


రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు కేటీఆర్. అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇంకా రుణమాఫీ పూర్తి చేయలేకపోవడం దారుణం అని విమర్శించారు. పోనీ ప్రభుత్వానికి కుదరలేదనుకుందాం, కనీసం ఎప్పటిలోగా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయగలరో అదయినా చెప్పాలని నిలదీశారు. డెడ్ లైన్ లేకుండా రుణమాఫీ చేశామని, చేసేశామని, ఇంకా పూర్తి కాలేదని.. ఇలా ఒక్కో నాయకుడు ఒక్కో రకంగా మాట్లాడటం సరికాదన్నారు కేటీఆర్.

49వేల కోట్ల రూపాయల రుణాలు రైతులు తీసుకుంటే, అందులో రూ.7వేల కోట్లు మాత్రమే మాఫీ జరిగిందని సాక్షాత్తూ ఆర్థిక మంత్రి ఒప్పుకున్నారని చెప్పారు కేటీఆర్. హామీ ఇచ్చిన దాంట్లో 1/7వంతు కూడా మాఫీ చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. కనీసం ఒక్క ప్రాంతంలో అయినా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందని నిరూపించగలిగితే తాను రాజీనామా చేస్తానని, రాజకీయాలనుంచే తప్పుకుంటానని సవాల్ చేశానని, దానికి ఇంత వరకు కాంగ్రెస్ నుంచి సమాధానం లేదన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ప్రధాన ప్రతిపక్షంగా తాము డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారాయన.

First Published:  22 Aug 2024 7:07 PM IST
Next Story