Telugu Global
Telangana

కాళేశ్వరం వద్ద గోదావరికి పూజలు చేసిన కేటీఆర్

అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు తాము వేచి చూస్తామని, ఆగస్ట్ 2 లోపు పంప్ లు ఆన్ చేయకపోతే 50వేలమంది రైతులతో తామే ఇక్కడకు వచ్చి నీళ్లు ఎలా ఇవ్వాలో చూపిస్తామని చెప్పారు కేటీఆర్. పంప్ లు తామే ఆన్ చేయాల్సి వస్తుందని అల్టిమేట్టం ఇచ్చారు.

కాళేశ్వరం వద్ద గోదావరికి పూజలు చేసిన కేటీఆర్
X

కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనలో భాగంగా.. గోదావరి నదికి ప్రత్యేక పూజలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. టెంకాయ కొట్టి, నదీమతల్లికి పసుపు, కుంకుమ, పూలు సమర్పించారు. జల వనరులను జల దేవతలుగా పరిగణించిన ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు బీఆర్ఎస్ నేతలు.


కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనలో భాగంగా నిన్న తొలిరోజు కరీంనగర్‌లో లోయర్ మానేరు డ్యామ్ ని బీఆర్ఎస్ నేతలు సందర్శించారు. గోదావరి వరద ప్రవాహంతో కాళేశ్వరంపై వచ్చిన అనుమానాలన్నీ పటాపంచలయ్యాయని అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఈ వరదలు తుడిచిపెట్టేశాయన్నారు. ఇకనైనా రైతాంగానికి మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని కాంగ్రెస్ కి హితవు పలికారు కేటీఆర్.

ప్రాజెక్ట్ సందర్శన రెండోరోజు ఇందారం వద్ద నీటి ప్రవాహం లేకపోవడం వల్ల ఎండిపోయిన గోదావరి నదిని పరిశీలించారాయన. సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి ఆయన ఇందారం వద్దకు వచ్చారు. వర్షంలో, చలిగాలిలో కూడా బీఆర్ఎస్ బృందం ప్రాజెక్ట్ సందర్శన కొనసాగించడం విశేషం. ఇందారం అనంతరం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం, కాళేశ్వరానికి బీఆర్ఎస్ నేతలు వచ్చారు. అక్కడి శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి వారిని నేతలు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు.

కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరోసారి కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు. లోయర్ మానేరులో నీటిని నిల్వచేయలేకపోయారని విమర్శించారు. పైనుంచి నీళ్లు వచ్చే పరిస్థితి లేకపోయినా ఇక్కడ నీరు నిల్వ చేసుకోలేకపోవడం దారుణం అన్నారు కేటీఆర్. కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, రాజరాజేశ్వర సాగర్ లో నీటిని నిల్వ చేసుకుంటే రైతులకు దిగులు ఉండదన్నారు. కేసీఆర్ హయాంలో ఈ రిజర్వాయర్లన్నీ నిండు కుండల్లా ఉండేవని, కానీ ఇప్పుడు నీరు లేక ఎండిపోయే పరిస్థితి ఉందన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే ఈ పని చేశారని, ఇప్పుడు ఎన్నికలైపోయాయి కాబట్టి ఇక రాజకీయంగా ఆందోళన చెందొద్దని ప్రజలకు ఉపయోగపడే పని చేయాలని కాంగ్రెస్ నేతల సూచించారు కేటీఆర్.


తెలంగాణకు కాళేశ్వరం కామధేనువు, కల్పతరువు అని చెప్పారు కేటీఆర్. కేసీఆర్ ఆదేశాల మేరకు తాము కాళేశ్వరం పర్యటనకు వచ్చామన్నారు. నదిలో నీరు ఉందని, బటన్ నొక్కి పంప్ లు ఆన్ చేస్తే అన్ని రిజర్వాయర్లను నింపొచ్చని, కానీ రాజకీయ సంకల్పం లేకపోవడం దురదృష్టకరం అన్నారు. కన్నేపల్లి వద్ద లక్ష్మీ పంప్ హౌస్ ని వెంటనే ఆన్ చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు తాము వేచి చూస్తామని, ఆగస్ట్ 2 లోపు పంప్ లు ఆన్ చేయకపోతే 50వేలమంది రైతులతో తామే ఇక్కడకు వచ్చి నీళ్లు ఎలా ఇవ్వాలో చూపిస్తామని చెప్పారు. పంప్ లు తామే ఆన్ చేస్తామని తేల్చి చెప్పారు కేటీఆర్.

First Published:  26 July 2024 6:23 AM GMT
Next Story