మొగులయ్య కుటుంబాన్ని వ్యక్తిగతంగా ఆదుకుంటా -కేటీఆర్ హామీ
మొగులయ్య కుటుంబాన్ని వ్యక్తిగతంగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. తన టీమ్ వెంటనే మొగులయ్యను సంప్రదించి ఆర్థిక సహాయం అందజేస్తుందని కేటీఆర్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్యను ఆదుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. మొగులయ్య ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉపాధి కోసం కూలి పనులకు వెళ్తున్నారని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలు కేటీఆర్ దృష్టికి వెళ్లడంతో ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.
మొగులయ్య కుటుంబాన్ని వ్యక్తిగతంగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. తన టీమ్ వెంటనే మొగులయ్యను సంప్రదించి ఆర్థిక సహాయం అందజేస్తుందని కేటీఆర్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. కిన్నెర వాయిద్య కళాకారుడు అయిన మొగులయ్యకు 2022లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. ఈ అవార్డు అందజేత తర్వాత అప్పటి కేసీఆర్ సర్కార్ మొగులయ్యను సత్కరించి కోటి రూపాయల రివార్డు, హైదరాబాద్‌లో ఇంటి స్థలం ప్రకటించారు. అలాగే నెలకు రూ. 10 వేల నెల వారీ గౌరవ వేతనం అందిస్తామని హామీ ఇచ్చారు.
Thanks Sucheta Ji for bringing this news to my attention
— KTR (@KTRBRS) May 3, 2024
I will personally take care of Sri Moguliah’s family. My team @KTRoffice will reach out to him immediately https://t.co/xV4NjXtik6
కాగా, ప్రభుత్వం అందజేసిన డబ్బుతో పిల్లల పెళ్లిళ్లు చేసిన మొగులయ్య ఇటీవల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తనకు నెలకు వచ్చే రూ.10 వేల గౌరవ వేతనం కూడా ఆగిపోవడంతో ఆయన ఉపాధి కోసం భవన నిర్మాణ పనులకు వెళ్లడం మొదలుపెట్టారు. మొగులయ్య కొడుకుల్లో ఒకరు మూర్ఛ వ్యాధితో బాధ పడుతుండగా.. వైద్య ఖర్చులకే నెలకు రూ.7500 ఖర్చు పెట్టాల్సి ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే మొగులయ్య కూలి పనులకు వెళ్లడం ప్రారంభించారు. ఈ విషయం కేటీఆర్ దృష్టికి వెళ్లడంతో మొగులయ్య కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.