Telugu Global
Telangana

కేసీఆర్‌ అంటే నీళ్లు.. కాంగ్రెస్‌ వస్తే కన్నీళ్లు

హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ కి ఓట్లు, సీట్లు రాలేదని, అందుకే ఆ పార్టీకి హైదరాబాదీయులంటే కోపం అని అన్నారు కేటీఆర్. హైదరాబాద్ పై కక్షకట్టావా రేవంత్..? అని ప్రశ్నించారు.

కేసీఆర్‌ అంటే నీళ్లు.. కాంగ్రెస్‌ వస్తే కన్నీళ్లు
X

కేసీఆర్‌ అంటే నీళ్లు.. కాంగ్రెస్‌ వస్తే కన్నీళ్లు అని 2023 నవంబర్‌లోనే తాము స్పష్టంగా చెప్పామని.. ఇప్పుడు అదే నిజమయ్యిందని అన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్ట్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఓ అసమర్థ ముఖ్యమంత్రి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి నిధులు పంపించడంలో ఆయన బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు కేటీఆర్.


సాగునీరు, తాగు నీరు లేక పల్లె ప్రజలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. అధిక ధరలు చెల్లించి మరీ ట్యాంకర్లు తెప్పించుకుంటున్నారని, వేసవి ఆరంభంలోనే తాగునీటి కోసం తన్నులాటలు మొదలయ్యాయని అన్నారు కేటీఆర్. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, వైఫల్యాల కాంగ్రెస్‌ సృష్టించిన కొరత ఇదని చెప్పారు. పార్టీ గేట్లు ఎత్తుతానంటున్న ముఖ్యమంత్రికి చేతనైతే ప్రాజెక్ట్‌ల గేట్లు ఎత్తాలన్నారు. రాష్ట్రంలో కరువు వల్ల 218 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఆ వివరాలన్నీ రేవంత్ రెడ్డికి పంపిస్తామన్నారు కేటీఆర్.

హైదరాబాద్ పై రేవంత్ కి కోపం..

హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ కి ఓట్లు, సీట్లు రాలేదని, అందుకే ఆ పార్టీకి హైదరాబాదీయులంటే కోపం అని అన్నారు కేటీఆర్. హైదరాబాద్ పై కక్షకట్టావా రేవంత్..? అని ప్రశ్నించారు. నీళ్ల ట్యాంకర్లను పంపించిన తమని మెచ్చుకోవాలంటున్న ముఖ్యమంత్రికి సిగ్గుండాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి నిజాయితీ ఉంటే ఉచితంగా ట్యాంకర్లతో నీరు సరఫరా చేయాలన్నారు కేటీఆర్. హైదరాబాద్ చుట్టూ ప్రాజెక్ట్‌ల్లో నీళ్లు ఉన్నా.. నగరంలో నీటి ఎద్దడికి కారుకులెవరని సూటిగా ప్రశ్నించారు. మహిళలు ఖాళీ బిందెలతో యుద్ధాలు చేస్తున్నారన్నారు.

జంపింగ్ లపై విమర్శలు..

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందేనని డిమాండ్ చేశారు కేటీఆర్. ఒక పార్టీ గుర్తుపై పోటీ చేసి గెలిచి, వేరే పార్టీలో పోటీ చేయటం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పారాయన. సుప్రీంకోర్టు తీర్పు కూడా స్పష్టంగా ఉందని, కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై కోర్టుకు వెళ్తామన్నారు. స్టేషన్ ఘన్‌పూర్, ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక ఖాయం అని అన్నారు కేటీఆర్.

First Published:  3 April 2024 4:03 PM IST
Next Story