సాగర తీరాన ఠీవిగా.. అంబేద్కర్ విగ్రహ విశేషాల వీడియో పోస్ట్ చేసిన కేటీఆర్
అంబేద్కర్ విగ్రహాన్ని దేశీయంగానే తయారు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. నోయిడా డిజైన్ అసోసియేట్స్‌కు అంబేద్కర్ విగ్రహ నిర్మాణ బాధ్యతలను అప్పగించారు.
హైదరాబాద్ నగరం నడిబొడ్డున.. సాగర తీరాన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతివనం ఇవ్వాళ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నది. ఇక్కడ ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహం ఇప్పుడు తెలంగాణకే గర్వకారణంగా మారనున్నది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పుతున్నామని 2016 ఏప్రిల్ 14న స్వయంగా కేసీఆర్ ప్రకటించారు. ఇవ్వాళ ఆ హామీ సాకారం కానున్నది.
అంబేద్కర్ భారీ విగ్రహం ఏర్పాటు రెండేళ్ల క్రితమే పూర్తి కావల్సి ఉన్నది. అయితే కోవిడ్ నేపథ్యంలో పనులకు ఆటంకం కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయానికి కూతవేటు దూరంలో, ప్రసాద్ మల్టీప్లెక్స్ పక్కనే 11.34 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్మృతివనం ఏర్పాటు చేశారు. విగ్రహంతో పాటు, గార్డెన్, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రూ.146.50 కోట్లు ఖర్చు పెట్టారు. రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ పనుల పర్యవేక్షణ జరగగా.. రోడ్లు, భవనాల శాఖ నిర్మాణ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకొని పనులు ప్రారంభించింది.
అంబేద్కర్ విగ్రహాన్ని దేశీయంగానే తయారు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. నోయిడా డిజైన్ అసోసియేట్స్‌కు అంబేద్కర్ విగ్రహ నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. ప్రముఖ శిల్పి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత రామ్ వన్‌జీ సుతార్, ఆయన కుమారుడు అనిల్ సుతార్ ఈ విగ్రహాల నమూనాలను తయారు చేశారు. ఈ విగ్రహాన్ని మొదట ఉక్కుతో నిర్మించి.. దానిపై ఇత్తడి తొడుగులను భిగించారు. ఇత్తడి విగ్రహం పూర్తిగా ఢిల్లీలో పోత పోశారు. ఈ విగ్రహం 30 ఏళ్ల పాటు మెరుస్తూనే ఉంటుంది. దానిపై పాలీయురేతీన్ కోటింగ్ కొట్టడమే కారణం. 30 ఏళ్ల తర్వాత మరోసారి కోటింగ్ వేస్తే మెరుపు అలాగే ఉంటుంది.
అంబేద్కర్ విగ్రహం ఎత్తు 125 అడుగులు.. అయితే ఆ విగ్రహాన్ని 50 అడుగుల పీఠంపై ఏర్పాటు చేశారు. అంటే ఈ భారీ విగ్రహం 175 అడుగుల ఎత్తులో.. ఆకాశాన్ని అంటేలా కనపడుతూ ఉంది. కేవలం విగ్రహం మాత్రమే ఏర్పాటు చేసి వదిలేయకుండా.. బాబా సాహెబ్ అంబేద్కర్ గురించిన విశేషాలతో స్మృతి భవనాన్ని నిర్మించారు. ఇందులో మ్యూజియం, లైబ్రరీ, ఆడియో, వీడియో విజువల్ హాల్, కాన్ఫరెన్స్ హాల్ నిర్మించారు. అంబేద్కర్ జీవితంలోని కీలకమైన, మరుపురాని ఘట్టాలకు సంబంధించిన వీడియోలను నిత్యం ప్రసారం చేస్తారు. ఇక్కడ అంబేద్కర్‌కు సంబంధించిన ఫొటో గ్యాలరీ కూడా ఉన్నది.అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన పీఠం వరకు సందర్శకులు వెళ్లే వీలుంది.
ఇక అంబేద్కర్ స్మృతి వనాన్ని 2.93 ఎకరాల్లో తీర్చి దిద్దుతున్నారు. దీనికి సంబంధించిన పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. పచ్చదనంతో పాటు రాక్ గార్డెన్స్, ఫౌంటెయిన్, ఫ్లవర్ గార్డెన్, టికెట్ కౌంటర్, సెక్యూరిటీ రూమ్, టాయిలెట్స్ ఉన్నాయి. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం విగ్రహం పట్టుకొని ఉండగా.. కింద భారత పార్లమెంట్ భవనాన్ని పోలిన కట్టడం సందర్శకులను ఆకట్టుకునేలా ఉంది.
ఇవీ విశేషాలు..
స్మృతి వనం మొత్తం విస్తీర్ణం : 11.34 ఎకరాలు
విగ్రహం బరువు : 465 టన్నులు
పీఠం ఎత్తు : 50 అడుగులు
విగ్రహం ఎత్తు : 125 అడుగులు
వెడల్పు : 45 అడుగులు
విగ్రహానికి వినియోగించిన ఉక్కు : 353 టన్నులు
విగ్రహానికి వినియోగించిన ఇత్తడి : 112 టన్నులు
నిర్మాణ వ్యయం : రూ.146.50 కోట్లు
మెమోరియల్ బిల్డింగ్ లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ : 2,066 చదరపు అడుగులు
గ్రౌండ్ ఫ్లోర్ : 15,200 చదరపు అడుగులు
ఫస్ట్ ఫ్లోర్, టెర్రస్ : 2,200 చదరపు అడుగులు
మొత్తం విస్తీర్ణం : 19,466 చదరపు అడుగులు
ల్యాండ్ స్కేప్ : 2.93 ఎకరాలు
పార్కింగ్ ఏరియా : 5.23 ఎకరాలు
టికెటింగ్, మౌలిక వసతులు : 6,792 చదరపు అడుగులు
వీడియో పోస్ట్ చేసిన కేటీఆర్..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆవిష్కరిస్తున్న ఆయన భారీ విగ్రహానికి సంబంధించిన విశేషాలతో కూడిన వీడియోను మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. 'స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం బోధించే మతం నాకు ఇష్టం' అనే కోట్ రాశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు నా గౌరవ వందనం అని మంత్రి పేర్కొన్నారు.
“I like the Religion that teaches Liberty, Equality and Fraternity”
— KTR (@KTRBRS) April 14, 2023
On his birth anniversary, Respects to Bharat Ratna Dr. B.R. Ambedkar Ji
Delighted that Telangana CM KCR Garu will be unveiling world’s largest statue of the visionary leader pic.twitter.com/HvVm51nYRX