Telugu Global
Telangana

డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మలకు కేటీఆర్‌ ఫోన్‌

నగరంలోని వస్త్ర ఉత్పత్తిదారులు, చేనేత కార్మికులు కేటీఆర్ ని కలిశారు. మరమగ్గాల పరిశ్రమ సంక్షోభం, నేత కార్మికుల ఉపాధి అవకాశాలపై ఆయనతో చర్చించారు.

డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మలకు కేటీఆర్‌ ఫోన్‌
X

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, చేనేత-జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి ఫోన్ చేసి చేనేత కార్మికుల సమస్యలను వివరించారు మాజీ మంత్రి కేటీఆర్. వారిని ఆదుకోవాలని, ఆత్మహత్యలు నివారించాలని కోరారు. బతుకమ్మ చీరల బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని నివారించాలన్నారు.

బుధవారం కేటీఆర్ సిరిసిల్ల పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన కాసేపు స్థానికులతో మాట్లాడారు. నగరంలోని వస్త్ర ఉత్పత్తిదారులు, చేనేత కార్మికులు కేటీఆర్ ని కలిశారు. మరమగ్గాల పరిశ్రమ సంక్షోభం, నేత కార్మికుల ఉపాధి అవకాశాలపై ఆయనతో చర్చించారు. వారితో సమావేశంలో ఉండగానే భట్టి, తుమ్మలకు ఫోన్ చేసి మాట్లాడారు కేటీఆర్. నేతన్నల ఉపాధి, పరిశ్రమ సంక్షోభం.. తాజా పరిస్థితులను వివరించారు. గత ప్రభుత్వం నేతన్నల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రులు సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

బుధవారం సిరిసిల్లలో చేనేత కార్మికులు నిరసన ప్రదర్శన చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ‘నేతన్నల ఆకలి కేక’ పేరిట మహాధర్నా చేపట్టారు. నేత కార్మికులు, వస్త్ర ఉత్పత్తిదారులు ర్యాలీ తీశారు. గతేడాది ఇచ్చిన బతుకమ్మ చీరలకు సంబంధించి రూ.482 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని, బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి చేతినిండా పని కల్పించాలని కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయిందని విమర్శించారు సీఐటీయూ నాయకులు.

First Published:  29 Feb 2024 8:18 AM IST
Next Story