రేవంత్‌కు కేటీఆర్ ఫోబియా
సీఎం డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే బండి సంజయ్, రఘునందన్‌లు మాట్లాడుతున్నారన్న ఎమ్మెల్యే కేపీ
రాజ్ పాకాల ఫ్యామిలీ ఫంక్షన్ కు ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా పిల్లలు, వృద్దులు అని కూడా చూడకుండా వారి కుటుంబ సభ్యులను పోలీసులు ఇబ్బంది పెట్టారని ఎమ్మెల్యే కే పీ వివేకానంద ఆగ్రహం వ్యక్తం చేశారు.రేవంత్ సర్కార్ అండ చూసుకుని అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మలుగా మారుతున్నారు. మేము అధికారంలోకి వచ్చాక ఇబ్బంది పెట్టిన అధికారులను ఎవరినీ వదలమని హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేపీ వివేకానంద మాట్లాడుతూ...రేవంత్ రెడ్డికి ప్రజల్లో ఆదరణ తగ్గుతోందని, పాలనను గాలికి వదిలేశారు. ఆయనకు కేటీఆర్ సిండ్రోమ్ పట్టుకుంది, కేటీఆర్ ఫోబియా పట్టుకున్నదన్నారు. కేటీఆర్ బావమరిది స్వంత ఇంట్లో కుటుంబసభ్యులతో పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. పోలీసులు, ఆబ్కారీ వాళ్ళు స్వయంగా రాజ్ పాకాల ఇంటికి వెళ్లి సెర్చ్ చేశారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా రాజ్ పాకాల కుటుంబ సభ్యులను పోలీసులు ఇబ్బంది పెట్టారు. అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. రిటైర్డ్ అయినా మేము అధికారంలోకి వచ్చాక ఇబ్బంది పెట్టిన అధికారులను వదిలపెట్టమని హెచ్చరించారు. సీఎం బండి సంజయ్, రఘునందన్ రావులతో రేవంత్ రెడ్డి మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు.కేటీఆర్‌ను ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై మాట తప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రజల్లో కేటీఆర్‌కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
రేవంత్ రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారు.స్వంత ఇంట్లో పార్టీ చేసుకోవద్దా? అని ప్రశ్నించారు. మా ఎమ్మెల్యే ఇటీవల ప్రైవేట్ పార్టీకి వెళ్లి వస్తుంటే ఇరికించే ప్రయత్నం చేశారు.కేటీఆర్‌పై బురదచల్లాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజ్ పాకాల కొత్త ఇళ్లు కట్టుకుని గృహ ప్రవేశం చేశారు. ఆయన ఇంట్లో కేటీఆర్, ఆయన సతీమణి లేరన్నారు. కేటీఆర్‌ను మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌లో ఇది జరుగుతోందని, ఆయన చీకటి మిత్రుడు బండి సంజయ్ ముందుగానే రియాక్ట్ అవుతున్నారు. బండి సంజయ్, రఘునందన్ రావులతో ముఖ్యమంత్రే మాట్లాడిస్తున్నారు.రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సహాయ మంత్రిగా ఉన్నారని ఎద్దేవా చేశారు.
ఓరియన్ విల్లాస్ వద్ద ఉద్రిక్తత
రాయదుర్గం ఓరియన్ విల్లాస్ వద్ద బీఆర్‌ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. రాయదుర్గంలోని రాజ్ పాకాల విల్లాలో తనిఖీలు చేపట్టడానికి ఎక్సైజ్ అధికారులు వెళ్లారు. విల్లాకు తాళం వేసి ఉండటంతో ఎక్సైజ్ సిబ్బంది వేచి చూసింది. రాజ్ పాకాల సమీపంలోని మరో విల్లాలో ఉన్నారని ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందింది. ఆ విల్లాలో తనిఖీ చేయడానికి ఎక్సైజ్ అధికారులు యత్నించారు. తనిఖీలకు ప్రయత్నించిన ఎక్సైజ్ అధికారులతో ఎమ్మెల్యేలు, ఎమ్మల్సీలు వాగ్వాదానికి దిగారు. సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా తనిఖీలు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.