Telugu Global
Telangana

సంస్కరణశీలి పీవీ చరిత్రను దేశం ఎన్నటికీ మరచిపోదు -కేటీఆర్

కవి, కథకుడు, సాహిత్యపరుడు, సామాజిక స్పృహ ఉన్న నాయకుడు, సంస్కరణశీలి పీవీ అని చెప్పారు కేటీఆర్.

సంస్కరణశీలి పీవీ చరిత్రను దేశం ఎన్నటికీ మరచిపోదు -కేటీఆర్
X

85 ఏళ్ల వయసులో కంప్యూటర్ నేర్చుకోవాలన్న తపనతో ప్రయత్నం చేసిన.. భారత రత్న, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నిత్య విద్యార్థి అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ శాసన సభలో నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనకు భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేసిందని, ఆ తీర్మానాన్ని గౌరవించి పీవీకి కేంద్రం అత్యున్నత పురస్కారం ఇచ్చిందని గుర్తు చేశారాయన. గొప్ప సంస్కరణశీలిగా పేరున్న పీవీ చరిత్రను దేశం ఎన్నటికీ మరచిపోదన్నారు కేటీఆర్.


తెలంగాణ భవన్ లో జరిగిన పీవీ నరసింహారావు జయంతి వేడుకలలో కేటీఆర్ పాల్గొన్నారు. ఆయనతోపాటు పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు, పీవీకి ఘన నివాళులర్పించారు. భారత దేశం ఉన్నన్ని రోజులు పీవీ నరసింహారావుని ప్రజలు గుర్తు పెట్టుకుంటారని అన్నారు కేటీఆర్. కవి, కథకుడు, సాహిత్యపరుడు, సామాజిక స్పృహ ఉన్న నాయకుడు, సంస్కరణశీలి అని పీవీ ఘనతను ప్రశంసించారు.

భూ సంస్కరణల్లో భాగంగా తన కుటుంబానికి సంబంధించిన 800 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించి దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు పీవీ నరసింహారావు అని చెప్పారు కేటీఆర్. నవోదయ పాఠశాలలు, గురుకులాలకు ఆద్యుడు పీవీ అని కొనియాడారు. చివరకు జైళ్ల శాఖ ఇచ్చినా కూడా అందులో కూడా సంస్కరణలు తీసుకొచ్చి ఓపెన్ జైల్ విధానాన్ని తీసుకొచ్చి, పాలనలో తన మార్కు చూపించారన్నారు. దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి.. ప్రమాదం అంచున ఉన్న ఆర్థిక వ్యవస్థను కాపాడిన గొప్ప ఆర్థిక వేత్త పీవీ అని అన్నారు కేటీఆర్.

First Published:  28 Jun 2024 7:37 AM GMT
Next Story