అంబర్ పేట్ లో కేటీఆర్ పాదయాత్ర..
అంబర్ పేట్ లో నిర్వహించిన ప్రచారంలో కేటీఆర్ వీధి వ్యాపారులను పలకరించారు, ఇంటింటికీ వెళ్లి ఆప్యాయంగా మాట్లాడారు.
లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభ్యర్థుల తరపున ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి ఇంటి తలుపు తడుతూ.. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి మద్దతివ్వాలని కోరుతున్నారు. సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో అంబర్ పేట్ లో కేటీఆర్ పాదయాత్ర నిర్వహించారు. పద్మారావు గౌడ్ ని ఎంపీగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో గెలిచేది గులాబీ పార్టీనే
— BRS Party (@BRSparty) March 31, 2024
అంబర్ పేట్ లో పాదయాత్రలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
ఈ ఎన్నికల్లో కిషన్ రెడ్డి ఓటమి ఖాయం
మరోసారి హైదరాబాద్ నగర ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేసిన కేటీఆర్… pic.twitter.com/iY9y1eiVFA
కిషన్ రెడ్డికి ఓటమి తప్పదా..?
స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే ఎన్నికల్లో ఓడిపోతే.. ఆ పార్టీకి అది తీరని అవమానంగా మిగిలిపోతుంది. అందుకే కిషన్ రెడ్డి టార్గెట్ గా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఈసారి కిషన్ రెడ్డి ఓటమి ఖాయం అంటున్నారు కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ వాసులు బీఆర్ఎస్ కే పట్టం కట్టారని, మరోసారి నగర వాసులు తమను ఆదరిస్తారని ఆయన అంటున్నారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే పద్మారావు గౌడ్ కి మద్దతు ఇవ్వాలని కేటీఆర్ ప్రజలను కోరారు.
ఓవైపు కీలక నేతలు పార్టీని వీడుతున్నా.. ఏమాత్రం అధైర్యపడకుండా బీఆర్ఎస్ శ్రేణుల్ని సమాయత్తం చేస్తున్నారు కేటీఆర్. పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం ఆయన సమీక్షలు చేపడుతున్నారు. ప్రచారంలో కూడా వారి వెంట నడుస్తున్నారు. అంబర్ పేట్ లో నిర్వహించిన ప్రచారంలో ఆయన వీధి వ్యాపారులను పలకరించారు, ఇంటింటికీ వెళ్లి ఆప్యాయంగా మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఎంత అవసరమో వారికి వివరించారు కేటీఆర్.