Telugu Global
Telangana

ఈసారయినా అది సాధించండి.. బండి సంజయ్ కు కేటీఆర్ లేఖ

బీజేపీ పాలిత రాష్ట్రాల ఎంపీలు తమ ప్రాంత ప్రయోజనాలకోసం కేంద్రంతో పోరాటం చేస్తున్నారని, తెలంగాణ ప్రాంతం బీజేపీకి 8మంది ఎంపీలను అందించిందని, మంత్రిగా అవకాశం పొందిన బండి సంజయ్.. ఈ ప్రాంత అభివృద్ధికి సాయం చేయాలని కోరారు కేటీఆర్.

ఈసారయినా అది సాధించండి.. బండి సంజయ్ కు కేటీఆర్ లేఖ
X

సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా కేంద్రం పక్కనపెట్టింది. దాదాపు పదిసార్లు కేంద్రానికి లేఖలు రాయడంతోపాటు, స్వయంగా కేంద్ర మంత్రుల్ని కలసి వినతిపత్రాలు అందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కానీ కేంద్రం కనికరం చూపలేదు. ఈసారయినా కేంద్ర బడ్జెట్ లో సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ కు చోటు సంపాదించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కోరారు కేటీఆర్. ఈమేరకు ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్.. తెలంగాణకు కనీసం పవర్ లూమ్ క్లస్టర్ అయినా తెచ్చిపెట్టాలన్నారు.


గత ఐదేళ్లు బండి సంజయ్ ఎంపీగా ఉన్నారని, ఈసారి కేంద్ర మంత్రి పదవి కూడా లభించిందని.. సిరిసిల్ల నేతన్నలకు సేవ చేసేందుకు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కేటీఆర్. కేంద్రంలో బీజేపీ సార‌థ్యంలోని ప్రభుత్వమే ఉంది కాబట్టి, ప్రధాని మోదీని ఒప్పించి సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తీసుకొచ్చే బాధ్యత బండి సంజయ్ తీసుకోవాలని కోరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ఎంపీలు తమ ప్రాంత ప్రయోజనాలకోసం కేంద్రంతో పోరాటం చేస్తున్నారని, తెలంగాణ ప్రాంతం బీజేపీకి 8మంది ఎంపీలను అందించిందని, మంత్రిగా అవకాశం పొందిన బండి సంజయ్.. ఈ ప్రాంత అభివృద్ధికి సాయం చేయాలని కోరారు కేటీఆర్.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సిరిసిల్లలో మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు మొదలయ్యాయని గుర్తు చేశారు కేటీఆర్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నేతన్నల కోసం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ సర్కారు ఆపివేసిందని, ఫలితంగా చేనేత రంగం మరోసారి సంక్షోభంలోకి వెళ్లిందని చెప్పారు. ఉపాధి లేక ఇక్కడి కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, మెగా పవర్ లూమ్ క్లస్టర్ వస్తే వారికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అన్నారు. క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన నైపుణ్యం కలిగిన కార్మికులు, వనరులు ఈ ప్రాంతంలో పుష్కలంగా ఉన్నాయని చెప్పారు కేటీఆర్.

First Published:  11 July 2024 12:42 PM GMT
Next Story