ఎమ్మెల్సీలకు కీలక బాధ్యతలు.. రేపే కేటీఆర్ సమావేశం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు.. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కీలక బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నారు కేటీఆర్.
లోక్ సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెంచింది. ఇప్పటికే లోక్ సభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ భవన్ లో జరుగుతున్న ఈ సమావేశాల్లో ఆయా నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలకు కేటీఆర్ దిశా నిర్దేశం చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాలకు అనధికారికంగా టికెట్లు ఖాయం చేస్తూ.. ఆయా నేతల్ని రంగంలోకి దిగాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో తాజాగా కేటీఆర్ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. రేపు మధ్యాహ్నం ఆయన ఎమ్మెల్సీలతో భేటీ అవుతారు.
కీలక బాధ్యతలు..
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు.. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కీలక బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నారు కేటీఆర్. పలువురు ఎమ్మెల్సీలను ఆయా లోక్ సభ నియోజకవర్గాలకు ఇన్ చార్జ్ లుగా నియమించి అభ్యర్థుల గెలుపు బాధ్యతలను వారికి అప్పగించే అవకాశముంది. ఎమ్మెల్యేలుగా గెలిచిన కొందరు కీలక నేతలు కూడా లోక్ సభకు పోటీ చేసే అవకాశముంది. లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ ని వెనక్కు నెట్టాలనే కృత నిశ్చయంతో ఉన్నారు కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు గాలివాటం మాత్రమేనని రుజువు చేయాలనుకుంటున్నారు.
బీఆర్ఎస్ మాత్రమే..
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా.. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ గెలుపు రాష్ట్ర అభివృద్ధికి అనివార్యం అంటున్నారు కేటీఆర్. పార్లమెంట్ లో తెలంగాణ తరపున బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే ప్రశ్నించారని, కేంద్రాన్ని నిలదీశారని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు గెలిచినా ఉపయోగం లేదంటున్నారాయన. అందుకే తెలంగాణ గళం వినపడాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలంటున్నారు. పార్టీ పరంగా అన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ గెలుపు అనివార్యం అనే వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.