Telugu Global
Telangana

నిరాశ వీడాలి.. బయటకు రావాలి

కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదని, మొత్తం లెక్క తీస్తే 420 హామీలు ఇచ్చారన్నారు కేటీఆర్. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టే బాధ్యత మనందరిపై ఉందన్నారు.

నిరాశ వీడాలి.. బయటకు రావాలి
X

బీఆర్ఎస్ నేతలు నిరాశ వీడి బయటకు రాావాలని, జనంతో మమేకమవ్వాలని పిలుపునిచ్చారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన.. నేతలు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనని, మన బలం, మన గళం, మన గులాబీ జెండా పార్లమెంట్ లో ఉండాలని చెప్పారు. బీఆర్ఎస్ తరపున మెజార్టీ ఎంపీలు పార్లమెంట్ లో లేకపోతే.. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరుగుతుందన్నారు కేటీఆర్. ఈ విషయాన్ని ప్రజలకు నేతలు వివరించి చెప్పాలన్నారు.


రుణమాఫీ పేరుతో దగా చేస్తారా..?

కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదని, మొత్తం లెక్క తీస్తే 420 హామీలు ఇచ్చారన్నారు కేటీఆర్. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టే బాధ్యత మనందరిపై ఉందన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉండి, అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని ప్రకటించారని, రైతులు రూ. 2 లక్షల రుణం తెచ్చుకోండని భరోసా ఇచ్చారని గుర్తు చేశారు కేటీఆర్. అధికారంలోకి వచ్చాక వ్యవసాయ మంత్రి తుమ్మల రుణాలు వసూలు చేయాలని అదేశాలిస్తున్నారని, కేసులు పెట్టాలని కూడా అంటున్నారని, ఇది మోసం కదా అని ప్రశ్నించారు కేటీఆర్. నిరుద్యోగ భృతి విషయంలో కూడా ఇలాగే అబద్ధాలాడారన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తామని హామీ ఇచ్చారని, కానీ అది సాధ్యం కాదని స్పష్టమైందన్నారు కేటీఆర్.

అదానీ ఒప్పందంతో అసలు రంగు..

కేసీఆర్ ఉన్నంత కాలం అదానీ తెలంగాణలో అడుగు పెట్టలేదని, కానీ కాంగ్రెస్ రాగానే ఎలా అడుగు పెడుతున్నారని ప్రశ్నించారు కేటీఆర్. ప్రధాని, అదానీ ఒక్కటేనని విమర్శలు చేసిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నేడు ఆయనతోనే ఒప్పందాలు ఎలా కుదుర్చుకున్నారని ప్రశ్నించారు. నోటికి వచ్చినట్లు మాట్లాడిన కాంగ్రెస్, బీజేపీ నాయకుల అసలు రంగు ఇప్పుడు బయటపడుతోందన్నారు. ఈసారి కూడా మెదక్ లో గులాబీ జెండా ఎగరుతుందని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్.

First Published:  19 Jan 2024 3:44 PM IST
Next Story