Telugu Global
Telangana

కామారెడ్డి బాధ్యత తీసుకున్న కేటీఆర్.. మెజార్టీకోసం బ్రహ్మాండమైన ఐడియా

ఈ నెల 9న కామారెడ్డిలో జరిగే సీఎం బహిరంగసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కేటీఆర్. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని, సంక్షేమ పథకాలను వారికి గుర్తుచేయాలన్నారు.

కామారెడ్డి బాధ్యత తీసుకున్న కేటీఆర్.. మెజార్టీకోసం బ్రహ్మాండమైన ఐడియా
X

గజ్వేల్ లో సీఎం కేసీఆర్ కి లక్ష మెజార్టీ దాటించే బాధ్యత తీసుకున్నారు మంత్రి హరీష్ రావు, ఇటు కామారెడ్డిలో సీఎం కేసీఆర్ బంపర్ మెజార్టీకోసం మంత్రి కేటీఆర్ పర్యటనలు మొదలు పెట్టారు. కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలంలో పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. సీఎం నియోజకవర్గం అయితే కామారెడ్డి దశ తిరుగుతుందని హామీ ఇచ్చారు కేటీఆర్.

ఆ పని మాత్రం చేయొద్దు..

ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అయిన తర్వాత కామారెడ్డిలో గణనీయంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పారు కేటీఆర్. ఇక్కడి భూముల ధరలు 20 నుంచి 30 రెట్లు పెరుగుతాయని అన్నారు. ఈ నియోజకవర్గంలో ఏ ఒక్కరూ గుంట భూమి ఉన్నా అమ్ముకోవద్దని సూచించారు. సీఎం నియోజకవర్గం అయితే ఒక్క కామారెడ్డిలో మాత్రమే కాకుండా చుట్టుపక్కల 50 కిలోమీటర్ల దాకా భూముల విలువ పెరుగుతుందన్నారు కేటీఆర్. కామారెడ్డి చుట్టూ ఉన్న ఐదారు నియోజకవర్గాల దశ తిరుగుతుందని చెప్పారు. కేసీఆర్‌ కామారెడ్డికి వస్తున్నది అందుకేనన్నారు.


ఆ బాధ్యత మాది..

కేసీఆర్‌ ఇక్కడికి వస్తే మీకు ఏ అభివృద్ధి పని కావాలన్నా వేగంగా జరుగుతుంది అన్నారు కేటీఆర్. "సీఎం చేత మీ పనులు చేయించే బాధ్యత నేను, గంప గోవర్ధన్‌ అన్న తీసుకుంటాం.." అని హామీ ఇచ్చారు. సీఎం నియోజకవర్గం కావడంతో గజ్వేల్ ఇప్పుడు బాగా అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. కామారెడ్డి కూడా రాష్ట్రంలోనే గొప్ప నియోజకవర్గంగా మారుతుందని చెప్పారు కేటీఆర్.

ఓట్లకోసం ఆ పని చేయండి..

కామారెడ్డిలో బీఆర్ఎస్ ఓట్లకోసం ఓ పని చేయండి అంటూ సభలో నవ్వులుపూయించారు కేటీఆర్. స్వాతిముత్యంలో కమల్‌ హాసన్‌ ఉద్యోగం కోసం సోమయాజులు వెంటపడ్డట్టు.. మీరంతా ఓట్ల కోసం ప్రజల వెంట పడాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు కేటీఆర్. ఈ నెల 9న కామారెడ్డిలో జరిగే సీఎం బహిరంగసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని, ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ సంక్షేమ పథకాలను వారికి గుర్తుచేసి ఓట్లడగాలని చెప్పారు.

First Published:  1 Nov 2023 8:29 AM IST
Next Story