Telugu Global
Telangana

ఎమ్మెల్సీలు పార్టీకి కళ్లు, చెవులు..

బీఆర్ఎస్ పార్టీని గ్రామస్థాయి నుంచి పోలిట్‌ బ్యూరో వరకు పునర్ వ్యవస్థీకరించాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిపారు కేటీఆర్.

ఎమ్మెల్సీలు పార్టీకి కళ్లు, చెవులు..
X

ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీకి చెవులు, కళ్లు అని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. పార్టీ ఎమ్మెల్సీలతో సమావేశం అయిన ఆయన.. లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోందని, అలర్ట్ గా ఉండాలని సూచించారు. ఎన్నికలకోసం సమాయత్తం కావాలంటూ దిశా నిర్దేశం చేశారు. మరికొన్ని రోజుల్లో పార్టీ అధినేత కేసీఆర్.. ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశం అవుతారన్నారు కేటీఆర్.


కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల అమలు కోసం శాసనసభలో పార్టీ తరపున ఒత్తిడి కొనసాగిస్తామని అన్నారు కేటీఆర్. అసెంబ్లీలో, కౌన్సిల్ లో బలమైన ప్రతిపక్షంగా ప్రశ్నిస్తామన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్‌కు గుర్తుచేస్తామని, తప్పించుకునే ప్రయత్నం చేస్తే నిలదీస్తామన్నారు.

త్రిముఖ పోరు..

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందని ఎమ్మెల్సీలకు చెప్పారు కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు అవకాశాలు బలంగా ఉన్నాయని, పార్టీ గెలుపుకోసం ఎమ్మెల్సీలు విస్తృతంగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది అంతా వరుసగా వివిధ ఎన్నికలు ఉన్నాయని.. వీటిని ఎదుర్కొనేందుకు పార్టీ తరపున సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

పునర్ వ్యవస్థీకరణ..

బీఆర్ఎస్ పార్టీని గ్రామస్థాయి నుంచి పోలిట్‌ బ్యూరో వరకు పునర్ వ్యవస్థీకరించాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిపారు కేటీఆర్. చురుకైన నాయకులు, కార్యకర్తల సేవలను పార్టీ మరింతగా ఉపయోగించుకుంటుందన్నారు. జిల్లా కేంద్రంగా పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృత పరుస్తామని చెప్పారు. శాసనమండలి సభ్యులు ఇప్పటికే తాము ఎంపిక చేసుకున్న నియోజకవర్గాల్లో చురుగ్గా పనిచేయాలి, పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని చెప్పారు కేటీఆర్.

First Published:  18 Jan 2024 4:07 PM GMT
Next Story