Telugu Global
Telangana

హైదరాబాద్ మెట్రో విస్తరణకు నిధులు కేటాయించండి..

మెట్రో రైలు విస్తరణ పనులకు రూ.8453కోట్లు ఖర్చవుతుందని, ఆమేరకు అధికారులు అంచనా వేశారని లేఖలో ప్రస్తావించారు మంత్రి కేటీఆర్. దీనికోసం 2023-24 కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరారు.

హైదరాబాద్ మెట్రో విస్తరణకు నిధులు కేటాయించండి..
X

హైదరాబాద్‌ మెట్రో విస్తరణకు కేంద్రాన్ని ఆర్థిక సాయం కోరారు మంత్రి కేటీఆర్. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరిప్రీత్‌ సింగ్‌ కు పూర్తి వివరాలతో కేటీఆర్ లేఖ రాశారు. మెట్రో రెండో దశలో బీహెచ్‌ఈఎల్‌ నుంచి లక్డీకపూల్‌ వరకు, నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు కొత్త మార్గాలు నిర్మించబోతున్నట్టు తెలిపారు కేటీఆర్. ఫేజ్‌-2లో ప్రతిపాదిత మార్గాల మధ్య మెట్రో రైలు విస్తరణ పనులకు రూ.8453కోట్లు ఖర్చవుతుందని, ఆమేరకు అధికారులు అంచనా వేశారని లేఖలో ప్రస్తావించారు. దీనికోసం 2023-24 కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరారు.

మెట్రో మొదటి దశలో 69కిలో మీటర్ల మేర రైలు మార్గాన్ని నిర్మించారు. రెండో దశలో మొత్తం 31కిలోమీటర్ల పొడవున రెండు భాగాల్లో విస్తరణకు ప్రణాళికలు రూపొందించారు. బీహెచ్‌ఈఎల్‌ నుంచి లక్డీకపూల్‌ వరకు 26కిలో మీటర్లు మెట్రో మార్గం నిర్మించాల్సి ఉంది. ఇందులో 23 స్టేషన్లు నిర్మిస్తారు. అటు నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు రెండోదశ రెండోభాగం నిర్మించాల్సి ఉంది. 5కిలోమీటర్లు పొడవు ఉండే ఈ రూట్ లో 4 స్టేషన్లు ఏర్పాటు చేస్తారు.

మెట్రోకు ఐదేళ్లు..

హైదరాబాద్‌లో మెట్రో రైలు సేవలు ప్రారంభమై ఈ నెలతో ఐదేళ్లు పూర్తవుతాయి. మెట్రో సర్వీసులు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ఛార్జీలను సవరించలేదు. చార్జీల సవరణ కోసం కేంద్రం నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ ప్రజలనుంచి అభిప్రాయాలు, సలహాలు స్వీకరించింది. ఆ సలహాల మేరకు కొత్త చార్జీలను ప్రకటించాల్సి ఉంది. మెట్రో రైలు చార్జీలు త్వరలో పెరిగే అవకాశముంది. అయితే సౌకర్యం, వేగాన్ని దృష్టిలో ఉంచుకుంటే చార్జీలు పెరిగినా మెట్రో ఆదరణకు ఢోకా ఉండదని అంటున్నారు.

First Published:  14 Nov 2022 9:20 PM IST
Next Story